ఈ నగరానికి ఏమైంది? | Cartons of Mond cigarettes seized in Hyderabad | Sakshi
Sakshi News home page

ఈ నగరానికి ఏమైంది?

Published Mon, Dec 25 2017 10:57 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

Cartons of Mond cigarettes seized in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరం బంగారం, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకే కాదు... విదేశీ సిగరెట్ల స్మగ్లింగ్‌కు అడ్డాగా మారుతోంది. ఏటా రూ.వందల కోట్ల విలువైన సిగరెట్లు‘దిగుమతి’ అవుతూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు గడిచిన 15 రోజుల్లో రూ.7 కోట్ల విలువైన 58.49 లక్షల సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 2న రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపోలోని ఓ కంటైనర్‌లో ఉన్న రూ.6.33 కోట్ల విలువైన, గత శుక్రవారం కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రూ. 65.96 లక్షల విలువైన సిగరెట్లు స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ తరహా ఉదంతాలు నగరంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. సిటీ కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.  

ఆ రెండు బ్రాండ్లే ఎక్కువ..
హైదరాబాద్‌కు అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో రెండు బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు డీఆర్‌ఐ గుర్తించింది. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్‌ కలిగి ఉండే డజరమ్‌ బ్లాక్, గుడాన్‌ గరమ్‌ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు గుర్తించింది. ఇవి ఇండోనేషియాలో తయారవుతున్నప్పటికీ అక్కడ నుంచి దుబాయ్‌ మీదుగానే సిటీకి వస్తున్నట్లు గుర్తించారు. అధికారుల కళ్లు గప్పేందుకు ఈ అక్రమ రవాణా సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువుల పేర్లతో జరుగుతోందని నిర్థారిస్తున్నారు. ఈ రెండు బ్రాండ్ల తర్వాతి స్థానంలో లండన్‌లో తయారయ్యే బెల్సన్‌ అండ్‌ హెడ్జెస్, యూఏఈకి చెందిన మోండ్‌ బ్రాండ్లు ఉంటున్నాయి.  

ఒక్కోసారి ఒక్కో ‘మార్గంలో’...
సిగరెట్ల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్‌ఐ అధికారులు డేగకన్ను వేశారు. ఈ గ్యాంగ్‌ గతంలో సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా డైపర్లుగా పేర్కొంటూ కంటైనర్‌ ముందు వరుసల్లో వాటిని ఉంచి,, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచ్చింది. మూసాపేటలో ఉన్న ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపోకు ఇవి చేరుకోవడంతో ఉప్పందిన డీఆర్‌ఐ అధికారులు 2014లో దాడి చేసి రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్లను పట్టుకుని నిందితులను అరెస్టు చేశారు. ఆపై పంథా మార్చిన అదే గ్యాంగ్‌ ఇంజినీరింగ్‌ వస్తువులు, కంప్యూటర్‌ స్పేర్‌ పార్ట్స్‌ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌కార్గోపై 2015లో దాడి చేసిన డీఆర్‌ఐ రూ.51 లక్షల విలువైన 85,000 సిగరెట్లు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. తాజాగా చిక్కిన రెండు కన్‌సైన్‌మెంట్లలో ఒకటి కంటైనర్ల రూపంలో మరోటి రైలు మార్గంలో సిటీకి వచ్చినట్లు తేలింది.  

ఒకటికి ఒకటిన్నర డ్యూటీ...
ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులను నష్టాన్ని కలిగించే సిగరెట్లపై ప్రభుత్వం దిగుమతి సుంకం (కస్టమ్స్‌ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవైన సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే అనేక ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని డీఆర్‌ఐ గుర్తించింది. సిటీలో ఉన్న కొందరు హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకుంటున్న ఈ ముఠాలు వారి ద్వారానే అక్రమ సిగరెట్లను మార్కెట్‌లోకి చెలామణి చేస్తున్నాయి.  

అన్ని పత్రాలు సృష్టించేస్తున్నారు...
విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులను ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో, ఎయిర్‌కార్గో కార్యాలయాల నుంచి తీసుకునేందుకు అనేక క్లియరెన్స్‌లు అవసరం. కస్టమ్స్‌ డ్యూటీ నుంచి వివిధ రకాలైన నిరభ్యంతర పత్రాలు దాఖలు చేస్తేనే గూడ్స్‌ బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే సిగరెట్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గ్యాం గ్స్‌ కస్టమ్స్‌ తరఫున పని చేసే కస్టమ్స్‌ హోమ్‌ ఏజెంట్లు (సీహెచ్‌ఏ)లతో పాటు అనేక మంది తో జట్టు కడుతున్నాయి. ఎగుమతి, దిగుమతి చేస్తున్నట్లు బోగస్‌ కంపెనీల పేర్లతో లెటర్‌ హెడ్స్‌ నుంచి కస్టమ్స్‌ క్లియరెన్స్‌ పత్రాల వరకు అన్నీ బోగస్‌వి సృష్టించేస్తున్నాయి. వీటిని చూపిస్తూనే సరుకును బయటకు తీసుకువస్తూ భారీ గా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా కాచి గూడ రైల్వేస్టేషన్లలో చిక్కిన సిగరెట్లను ముఠా సభ్యులు మయన్మార్‌ నుంచి తీసుకువచ్చినట్లు డీఆర్‌ఐ ప్రాథమికంగా నిర్థారించింది.

ఆరోగ్యానికీ చేటు..
అక్రమంగా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆయా సిగరెట్లు ఎక్కువసేపు కాలుతాయని, దీంతో పొగరాయుళ్ళు వాటి వైపు మొగ్గుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఇండోనేషియా సహా వివిధ దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారన్నది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత వరకు అనుకూలమో చెప్పలేమని అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్‌ హెల్త్‌ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్ళిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement