సిట్ కస్టడీకి డ్రగ్స్ స్మగ్లర్ కమింగా..
హైదరాబాద్: డ్రగ్స్ కేసు వ్యవహరం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ మైక్ కమింగాను సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచలగూడ జైల్లో ఉన్న అతడిని సిట్ అధికారులు ఇవాళ అదుపులోకి తీసుకుని మూడు రోజులపాటు ప్రశ్నించనున్నారు. కమింగా కాల్ లిస్టులో ప్రముఖుల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సమాచారం. ఈ విచారణ ఆధారంగా మరి కొందరికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
నెదర్లాండ్స్‌కు చెందిన కమింగా నగరంలోనే నివాసం ఉంటున్నాడు. అతడు హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలకు సలహాదారుగా పనిచేస్తున్న కమింగా చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో కొంతమంది సినీ నటులకు ఎక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కమింగా కాల్ లిస్టులో సుమారు1500 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల ఫోన్ నంబర్లు ఉన్నాయని తెలుస్తోంది. మల్టీ నేషనల్ కంపెనీలకు డ్రగ్స్ సరఫరా చేయడంలోను కమింగా కీలక పాత్ర పోషించాడని భావిస్తున్నారు.