ఈ హెచ్చుతగ్గుల కాలంలో.. ‘బ్యాలెన్స్‌డ్’గా ఉండాల్సిందే | During these jumps need to be balanced .. | Sakshi
Sakshi News home page

ఈ హెచ్చుతగ్గుల కాలంలో.. ‘బ్యాలెన్స్‌డ్’గా ఉండాల్సిందే

Published Mon, Jun 8 2015 12:07 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

During these jumps need to be balanced ..

కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది. అంతర్జాతీయ చమురు ధరలతో పాటు దేశీయ ద్రవ్యోల్బణం తగ్గటం, ద్రవ్య లోటుకు కళ్లెం వేయటం, నిరర్థక రుణాలు పెరగకపోవటం వంటివ న్నీ స్థూలంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందనే సంకేతాలిస్తున్నాయి. దీంతో వచ్చే నాలుగైదేళ్లలో వృద్ధి రేటు మెరుగుపడటం తప్పనిసరి. మరి ఆ వృద్ధి స్టాక్ మార్కెట్ విలువల్లోనూ ప్రతిఫలి స్తుంది కదా!!

 కొన్నాళ్లుగా చూస్తే మార్కెట్లు భారీగా పెరుగుతూ... అప్పుడప్పుడు తగ్గుతున్నాయి. నిజానికి ఏ మార్కెట్టూ నేరుగా పెరిగిపోదు. అయితే కంపెనీల ఆదాయాలు తగ్గుతున్నా మార్కెట్లో ఆ మేరకు కరెక్షన్ రాలేదు. కాబట్టి కరెక్షన్ అనూహ్యమేమీ కాదు. మార్కెట్లో పెట్టుబడులకు అవకాశమిచ్చేది కూడా ఈ కరెక్షన్లే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచటం... దాన్ని మార్కెట్లు దిగమింగుకోవటం జరిగేదాకా ఈ హెచ్చుతగ్గులుంటాయి. కాబట్టి తమ వాటాలు పెంచుకోవాలనుకునేవాళ్లకు అవకాశం వచ్చినట్లే.

పరిమితమైన రాబడులు ఆశిస్తూ దీర్ఘకాలిక దృష్టితో మన స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికైతే ఎలాంటి ఢోకా ఉండదనే చెప్పాలి. ఎందుకంటే సెన్సెక్ ప్రస్తుతం 15.9 ఫార్వార్డ్ పీఈ (ప్రైస్ ఎర్నింగ్స్ నిష్పత్తి) వద్ద ట్రేడవుతోంది. ఇది చారిత్రక సగటుకు దాదాపు సమానం. దీనర్థం మార్కెట్లు సరైన విలువ వద్దే ఉన్నట్లు. ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు తగ్గటం, వడ్డీరేట్లు తగ్గుతున్న నేపథ్యంలో డెట్ మార్కెట్లూ బాగుంటాయి. ఇలాంటపుడు ఇన్వెస్టర్లు వారి రిస్క్ సామర్థ్యం మేరకు అటు డెట్, ఇటు షేర్లు రెండింటా పెట్టుబడులు పెట్టాలి. దీర్ఘకాలానికిదే మంచి వ్యూహం.

ఇలా పెట్టడానికి చక్కని మార్గం బ్యాలెన్స్‌డ్ ఫండ్సే. వీటితో డెట్-ఈక్విటీల్లో ఎంతెంత పెట్టుబడులు పెట్టాలన్నది ముందే నిర్ణయించుకోవచ్చు. దీంతో స్టాక్ మార్కెట్లలోని లాభాలూ మిస్ కావు. డెట్‌లోని స్థిరత్వాన్నీ వదులుకోవాల్సిన పనిలేదు. పెపైచ్చు స్టాక్ మార్కెట్ల గమనాన్ని బట్టి ఈక్విటీ కేటాయింపుల్ని, వడ్డీ రేట్లను బట్టి డెట్ కేటాయింపుల్ని మార్చుకోవచ్చు.

 అడ్వాంటేజ్ ఫండ్స్ కూడా...
 సంప్రదాయ ఇన్వెస్టర్లకు బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి మార్కెట్లు చౌకగా ఉన్నపుడు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి... పెరగ్గానే లాభాలతో బయటికొస్తాయి. దీంతో రిస్క్ తక్కువ... దీర్ఘకాలంలో రాబడి ఎక్కువ. ఇన్వెస్టర్లకు ఇవి నిధుల కేటాయింపు టూల్స్‌ను కూడా అందిస్తున్నాయి. ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌తో పన్ను లాభాలూ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఫండ్లు 65 శాతం వరకూ నిధుల్ని ఈక్విటీలోనే పెడుతున్నాయి. ఈక్విటీ ఫండ్స్‌కు మల్లే దీనిపై పన్నులుంటాయి. అయితే ఇన్వెస్ట్‌మెంట్ సమయం ఏడాది దాటితే లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు.

ఏడాది లోగా విత్‌డ్రా చేసుకుంటే మాత్రం పన్ను వర్తిస్తుంది. ఇక వీటిపై ఇచ్చే డివిడెండుకూ పన్ను వర్తించదు. తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారికి, పెద్దగా రిస్క్‌ను ఇష్టపడని వారికి ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్లు ఉత్తమమని చెప్పాలి. తక్కువ ఒడిదుడుకులు, పన్ను లాభాలు అనే వారికి నచ్చే అంశాలు. ఇలాంటి ఫండ్లలో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకులకు అతీతంగా మంచి లాభాలొస్తాయనేది స్పష్టం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement