
బాబ్బాబు... ఎవరూ వెళ్లకండి!
కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరినీ వేడుకోవాల్సి వస్తోందట. ఎన్నికల ప్రణాళికలో కాపులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఏడాదికి వెయ్యి కోట్ల నిధులు విడుదల చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు సుమారు ఏడాదిన్నర వరకూ కార్పొరేషన్ ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. ఇటీవలే కార్పొరేషన్ ఏర్పాటు చేయటంతో పాటు చైర్మన్‌ను నియమించారు.
అయినా ఫలితం కనిపించటం లేదట. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపుగర్జన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఎవ్వరూ హాజరు కావద్దని చంద్రబాబు పార్టీలోని ప్రతి ఒక్కరినీ బతిమిలాడాల్సి వస్తోందట. మీ కోసం ఎంతో చేశాను, ఇంకా ఎంతో చేయబోతున్నాను, అయినా మీరు అటువైపు ఎందుకు మొగ్గు చూపుతున్నార ని ఒకింత ఆగ్రహంతో గద్దించి ఆ తరువాత అలా చేస్తే అసలుకే మోసం వస్తుందని భావించి ప్రస్తుతం వేడుకోళ్లే సరైన మార్గం అని నిర్ణయించుకుని అదే బాటలో చంద్రబాబు పయనిస్తున్నారట.