
ఎర్రచందనం కోసం కార్పొరేషన్!
* మార్కెటింగ్‌కు చైనాలో డిపో
* ఎర్రచందనం, మొక్కల పెంపకంపై సమీక్షలో సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేని ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌కు సొంతమని, దీనిద్వారా మరింత ఆదాయం పెంచుకునేందుకు కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఎర్రచందనం, మొక్కలు పెంపకంపై గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఎర్రచందనం మొక్కల పెంపకం, స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను భద్రపరచడం, వేలం వంటి వ్యవహారాలను కార్పొరేషన్ పరిధిలోకి తెస్తామని చెప్పారు. ఎర్రచందనాన్ని స్మగర్ల బారి నుంచి రక్షించేందుకు జియోట్యాగింగ్, డ్రోన్లను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,095 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నట్టు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
ఎర్రచందనం వేలంలో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేలా విదేశాల్లో మార్కెట్ సృష్టించాలని, చైనాలో డిపో ఏర్పాటు చేయడంతోపాటు చైనీస్ కరెన్సీలో కూడా వేలం వేసే యోచన చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 23.04శాతమే ఉందని, నాలుగేళ్లలో 12లక్షల హెక్టార్లలో మొక్కలు పెంచాలని చెప్పారు.
పనులు పూర్తి కాకపోతే కఠిన చర్యలు
పుష్కర పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తిచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గురువారం ఉదయం ఆయన ఇంద్రకీలాద్రి, పుష్కరఘాట్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇకమీదట ప్రతి వారమూ పనుల్ని పరిశీలిస్తానని చెప్పారు.
పలు రంగాల్లో ఆస్ట్రియా సహకారం
వ్యవసాయం, జలశుద్ధి రంగాల్లో తాము అభివృద్ధి చేసిన నూతన సాంకేతిక ఆవిష్కరణలను రాష్ర్టంలో ప్రవేశపెట్టేందుకు ఆస్ట్రియా దేశం ముందుకొచ్చింది. ఈ విషయమై ఆస్ట్రియా ఉప రాయబారి జార్జ్ జెట్నర్ నేతృత్వంలోని బృందం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యింది. వివిధ అంశాల్లో కలిసి పనిచేయడానికి 2003లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తొలిదేశం తమదేనని, మళ్లీ అదే సీఎం సారథ్యంలో ముందుకెళ్లే అవగాహనకు వచ్చామని తెలిపారు.
అమరావతిలో బ్రిటన్ ఆస్పత్రికి అనుమతి
అమరావతిలో బ్రిటన్ సహకారంతో ఏర్పాటుచేయనున్న హాస్పిటల్ ప్రాజెక్టుకు త్వరలో అనుమతులిస్తామని సీఎం తెలిపారు. భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ అస్‌క్విత్ బృందం గురువారం సీఎంతో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంలోని 10 ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు. అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై బ్రిటన్ హైకమిషనర్‌కు సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు.