'మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి'
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకుండా లండన్లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీని భారత్ రప్పించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యక న్యాయస్థానాన్ని కోరింది. సోమవారం ప్రత్యేక పీఎమ్ఎల్ఏ న్యాయస్థానంలో ఈడీ తరపు న్యాయవాదులు ఈ మేరకు విన్నవించారు.
ఐపీఎల్ కమిషనర్గా పనిచేసిన కాలంలో మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ మోదీపై కేసు కూడా నమోదు చేసింది. ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురికావడంతో పాటు కేసులు నమోదు కావడంతో మోదీ లండన్ పారిపోయారు. 2010 నుంచి మోదీ లండన్లో ఉంటున్నారు. విచారణకు హాజరు కావాలని గతంలో ఈడీ సమన్లు పంపినా.. తనకు భారత్లో ప్రాణభయం ఉందంటూ మోదీ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోర్టును ఆశ్రయించింది.
ఇదిలావుండగా, ఇటీవల లలిత్ మోదీ ట్వీట్లతో బీజేపీ తలనొప్పిగా మారాడు. లలిత్ గేట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కేంద్ర మంత్రి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. వీసా విషయంలో సుష్మా, వసుంధర.. లలిత్ మోదీకి సాయం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక వసుంధర కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం కలిగిందనే విమర్శలూ వచ్చాయి.