మూగబోయిన టీ నగర్
చెన్నై: ముఖ్యమంత్రి జయలిలత మృతితో చెన్నైలోని ప్రధాన బిజినెస్ సెంటర్లు మూగబోయాయి. ముఖ్యంగా చెన్నైలో ప్రధాన షాపింగ్ కేంద్రంగా ప్రసిద్ది చెందిన టీ నగర్ లో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు.వీటితోపాటు ఉస్మాన్ రోడ్, పాండీ బజార్ సహా రంగనాధన్ వీధి లో అన్ని దుకాణాలను తమ అభిమాన ముఖ్యమంత్రి, ప్రియతమ అమ్మ మృతిపట్ల గౌరవ సూచకంగా మూసివేశారు. దీంతో కొనుగోలుదారులతో ఎంతో రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో తీరని విషాదంతో నిశ్శబ్దం అలుముకుంది.ఎపుడూ ఆటోరిక్షాలు, కార్లు, ద్విచక్రవాహనాలు సందడి ఉండే పలువాణిజ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారిపోయాయ. ఈ ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించడానికి ఉద్దేశించిన కొన్ని పోలీసు వాహనాలు మాత్రం దర్శనమిస్తున్నాయి
కాగా తీవ్ర అనారోగ్యం సోమవారం తుదిశ్వాస విడిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్ధివ దేహానికి పూర్తి అధికార లాంఛనాలతో ఈ సాయంత్రం 4.30 ని.లకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు తుది నివాళులర్పించేందకు గాను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే చెన్నైలోని రాజాజీకి భవనకు చేరుకుని నివాళులర్పించారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.