వేయిమంది నేతలు పార్టీ మారారు! | election situation in uttarakhand | Sakshi
Sakshi News home page

వేయిమంది నేతలు పార్టీ మారారు!

Published Tue, Feb 7 2017 6:34 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

వేయిమంది నేతలు పార్టీ మారారు! - Sakshi

వేయిమంది నేతలు పార్టీ మారారు!

  • ఉత్తరాఖండ్‌ ముఖచిత్రం.. విచిత్ర పరిస్థితి!


  • (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
    వారంలో పోలింగ్‌ జరిగే ఉత్తరాఖండ్‌లో పాలక, ప్రతిపక్షాలు రెండూ సమస్యలతో సతమౌతున్నాయి. అయిదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఎన్నికల్లో ఫిరాయింపుదారులకు అసెంబ్లీ టికెట్లిచ్చి తిరుగుబాట్లు ఎదుర్కుంటున్నాయి. మొత్తం 70 సీట్లకుగాను 15 నుంచి 20 స్థానాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.  నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ప్రధాన పార్టీల నేతలు దాదాపు వేయి మంది పార్టీలు మారారు. ఈ నెల ఒకటితో నామినేషన్ల ఉపసంహరణ ముగిసేనాటికి తిరుగుబాటు అభ్యర్థులు(బీజేపీ-18, కాంగ్రెస్‌-24) బహిష్కరణకు గురయ్యారు. కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన 13 మంది నేతలకు బీజేపీ టికెట్లు ఇవ్వగా, బీజేపీ మాజీ నేతలకు ఏడు స్థానాల్లో, బీఎస్పీ రెబల్స్‌కు రెండు చోట్ల కాంగ్రెస్‌ టికెట్లిచ్చింది.

    చాలా మంది నేతలతో నామినేషన్లు ఉపసంహరింపజేశాక కూడా బీజేపీ నాలుగో వంతు సీట్లలో, కాంగ్రెస్‌ మూడో వంతు స్థానాల్లో ‘రెబెల్స్‌’ తాకిడిని ఎదుర్కుంటున్నాయి. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన కేంద్ర మాజీ మంత్రి, ఆధ్యాత్మిక నేత సత్పాల్‌ మహరాజ్‌ బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి కవీంద్ర ఇష్టవాల్‌తో  చౌబత్తాఖాల్‌ స్థానంలో పోటీపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు కిషోర్‌ ఉపాధ్యాయ కూడా తన పార్టీకే చెందిన సీనియర్‌ నేత ఆర్యేంద్రశర్మ(ఇండిపెండెంట్‌)ను సాహస్‌పూర్‌లో ఎదుర్కుంటున్నారు. ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ అధిష్టానంతో మాట్లాడి ఉపాధ్యాయను ఇక్కడ నుంచి పోటీ చేయిస్తున్నారు.

    ఫిరాయింపుదార్లకే టికెట్లు
    మాజీ కాంగ్రెస్‌ సీఎం విజయ్‌ బహుగుణతో కలిసి బీజేపీలో చేరిన రుద్రప్రయాగ్‌ ఎమ్మెల్యే హరక్‌సింగ్‌ రావత్‌.. వేరే స్థానం నుంచి టికెట్‌ కోరడంతో కోట్‌ద్వార్‌లో ఆయనను నిలబెట్టారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీచేసిన బీజేపీ సీఎం బీసీ ఖండూరీ ఓడిపోయారు. హరక్‌ రావత్‌కు ఇక్కడి నుంచి పోటీచేయడం ఇష్టం లేదు. హరక్‌కు అవకాశం ఇచ్చిన కారణంగా కోట్‌ద్వార్‌ బీజేపీ మాజీ ఎమ్మెల్యే శైలేంద్రసింగ్‌ రావత్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. వెంటనే ఆయనకు యమకేశ్వర్‌ నుంచి పోటీచేయడానికి కాంగ్రెస్‌ టికెట్‌ లభించింది. దాంతో యమకేశ్వర్‌ కాంగ్రెస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే  రేణూ బిష్ట్‌ ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్నారు. ఖండూరీ కూతురు రీతూ ఖండూరీకి యమకేశ్వర్‌ టికెట్‌ కేటాయించగా, ఇక్కడ నుంచి గతంలో మూడుసార్లు బీజేపీ టికెట్‌పై గెలిచిన విజయ్‌ బర్తవాల్‌ ఆగ్రహంతో బీజేపీ కేంద్ర నాయకత్వానికి లేఖ రాయడమేగాక స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని ప్రకటించారు. చివరికి ఆయన ఆ పనిచేయకుండా రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనను శాంతింపచేశారు.
     
    సీఎం పదవికి పెరిగిన అభ్యర్థులు
    రాజకీయ సుస్థిరతకు దూరమైన ఉత్తరాఖండ్‌ 16 ఏళ్ల చరిత్రలో ఏడుగురు నేతలు సీఎం పదవి చేపట్టారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో ముగ్గురు, బీజేపీ హయాంలో నలుగురు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. విజయ్‌ బహుగుణ కూడా బీజేపీలో చేరడంతో బీజేపీలో సీఎం పదవి ఆశించేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. భారీ ఆనకట్టలు, జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, పర్వతాల లోపల నుంచి సొరంగాలు తవ్వకం కారణంగా పర్యావరణం దెబ్బతింది. 2013 వరదల వల్ల పర్యాటకుల రాక గణనీయంగా పడిపోయింది. రాజకీయ అవినీతి ఎక్కువైంది. రాష్ట్రంలోని పది కొండ ప్రాంత జిల్లాల నుంచి వలసలు పెరిగిపోతున్నాయి. ప్రధాన సమస్యలను విస్మరించి నేతల చుట్టూ ఎన్నికల రాజకీయాలు తిరుగుతున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 55.9 శాతం ఓట్లతో మొత్తం అయిదు సీట్లూ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 34.4 శాతం ఓట్లు మాత్రమే సాధించింది.

    2012 అసెంబ్లీ ఎన్నికలు(70) వివిధ పార్టీలకు వచ్చిన సీట్లు
    కాంగ్రెస్‌ -32
    బీజేపీ-31
    బీఎస్పీ-3
    ఇండిపెండెంట్‌-3

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement