ఎలక్ట్రానిక్ పరికరాలదే హవా..
శ్రీసిటీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రెండేళ్ల కిందట 2011లో శ్రీసిటీని ఆరంభించినపుడు 57 కంపెనీలు వచ్చాయని, ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరుకుందని శ్రీసిటీ మేనేజింగ్ డెరైక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలియజేశారు. కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. క్యాడ్‌బరీ, పెప్సీ వంటి కంపెనీలు రావటం వల్ల చిత్తూరు జిల్లా రైతులకు చాలా లబ్ధి కలగనుందని, పెప్సీ వల్ల మామిడి రైతులకు, క్యాడ్‌బరీ వల్ల డైరీ రైతులకు ప్రత్యక్షంగా లబ్ధి కలగనుందని తెలియజేశారు. శ్రీసిటీలో 40 శాతం స్థలాన్ని కంపెనీలకు ఇప్పటికే కేటాయించామని, మిగిలిన 60 శాతంలో కంపెనీలు రావటానికి మరో మూడేళ్లు పట్టొచ్చని చెప్పారు. అంతటా పరిశ్రమలకు గడ్డుకాలం ఉన్న ఈ తరుణంలో సైతం శ్రీసిటీలోకి కొత్త పరిశ్రమలు వస్తున్నాయంటూ... ప్రస్తుతం 8,500 మంది ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు.
చైనాకు చెందిన అతిపెద్ద ఆటోమోటివ్ కంపెనీ కేఎల్‌టీ శ్రీసిటీలో పరిశ్రమ ఏర్పాటు చేయటానికి ఆసక్తి చూపిస్తోందని తెలిపారు. అన్ని రకాల పరిశ్రమలూ వస్తున్నాయంటూ... మున్ముందు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థల హవా రానున్నదని చెప్పారు. దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతి బిల్లు చమురు దిగుమతి బిల్లును దాటేయబోతోందని, అందుకని వీటి తయారీ సంస్థలు దేశంలో మరిన్ని ఏర్పాటు కావాల్సి ఉందని చెప్పారాయన. అందుకనే ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ల తయారీ సంస్థలపై తాము ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని, శ్రీసిటీలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారాయన. ఫార్మా పరిశ్రమలను మాత్రం ఓకే చేయటం లేదని, ఫార్మా సంబంధిత పరికరాల తయారీ సంస్థల విషయంలో మాత్రం సానుకూలంగానే స్పందిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారాయన.
జపాన్ కంపెనీలు ఎందుకంటే..: శ్రీసిటీలోకి ఎక్కువగా జపాన్ కంపెనీలు వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.... జపాన్ సంస్థలు భారీ ఎత్తున చైనాలో కొలువు దీరాయని, ఇపుడవి వివిధ కారణాల రీత్యా ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తున్నాయని తెలియజేశారు. ‘‘వాళ్లకిపుడు ఇండియా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దాన్లో భాగంగానే శ్రీసిటీకి వస్తున్నారు. కాకపోతే వాళ్లకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల్ని కూడా వృద్ధి చేయాల్సి ఉంది’’ అన్నారాయన. దీన్లో భాగంగానే శ్రీసిటీలో గోల్ఫ్ కోర్స్ అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా ఉందన్నారు. భాగస్వామి లేదా డెవలపర్ లభిస్తే వెంటనే పనులు ఆరంభిస్తామని చెప్పారాయన. ఇప్పటిదాకా శ్రీసిటీలో తాము రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టామని, 8 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటు కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు. సొంత విద్యుత్తు ప్లాంటు ప్రతిపాదన కూడా ఉందని, త్వరలో దాన్ని కార్యరూపంలోకి తెస్తామని చెప్పారు. గడిచిన మూడేళ్లలో శ్రీసిటీ సెజ్ నుంచి రూ.600 కోట్లకు పైగా విలువైన ఎగుమతులు సాధించామని, దిగుమతులతో పోలిస్తే ఇది చాలా అధికమని తెలియజేశారు.