‘తరలింపు’ తంటాలు!
* రొటేషన్‌పై రాజధానికి ఉద్యోగుల బదిలీ
* విధానం లేకపోవడం పట్ల ఆవేదనలో ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని విజయవాడ ప్రాంతానికి ఉద్యోగుల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలతో ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రధానంగా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను రాజధానికి ఇప్పుడే పంపించేస్తారా? లేదా వచ్చే విద్యా సంవత్సరానికి పంపిస్తారా? అనే విషయంలో స్పష్టత లేక సతమతమవుతున్నారు.
దీంతో అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక విధానం లేకుండా ఉద్యోగులు రొటేషన్‌పై రాజధానికి వెళ్లి పనిచేయాలంటూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎం.కె. మీనా బుధవారం జారీ చేసిన ఆఫీస్ ఆర్డర్ సచివాలయ ఉద్యోగుల్లో కలకలం సృష్టిం చింది. సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ), ప్రొటోకాల్ విభాగాల్లో పనిచేస్తున్న ఎస్‌ఓలు, ఏఎస్‌ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు రొటేషన్ విధానంలో విజయవాడ వెళ్లి పనిచేయాలంటూ మీనా జారీ చేసిన ఆఫీస్ ఆర్డర్‌లో స్పష్టం చేశారు.
సాధారణ పరిపాలన శాఖ రాజకీయ, ప్రొటోకాల్ విభాగాల్లో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక వారం విజయవాడ వెళ్లి పనిచేయాలని, తదుపరివారం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విజయవాడ వెళ్లి పనిచేయాలని అందులో ఆదేశించారు.