నైపుణ్యాలే ఉపాధికి ఊతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత పోటీ యుగంలో ఉద్యోగావకాశాలు దక్కించుకునేందుకు నైపుణ్యాలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా యువతకు వివిధ అంశాల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణనివ్వడంపై దృష్టి సారించినట్లు నాస్డాక్ లిస్టెడ్ సంస్థ హీలియోస్ అండ్ మాథెసన్ నేషనల్ హెడ్ (గవర్నమెంట్ వర్టికల్ విభాగం) మండల రవి తెలిపారు. గత ఏడేళ్లుగా ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేతులు కలిపామని ఆయన వివరించారు.
వివరాలు రవి మాటల్లోనే...ఐటీ, రిటైల్ సేల్స్ వంటి అంశాల్లో శిక్షణ..
పదో తరగతి, ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేట్లకు బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగం), ఐటీ, రిటైల్ సేల్స్ వంటి అంశాల్లో శిక్షణనిస్తున్నాం. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే జీహెచ్‌ఎంసీ వంటి సంస్థలకు కావాల్సిన సిబ్బంది కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. ఇలాంటి ప్రాజెక్టుల కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి మరికొన్ని సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్న పరిశ్రమల జాతీయ ఇనిస్టిట్యూట్ (ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ)తో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. అటు, జాతీయ స్థాయిలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ)తోనూ చేతులు కలుపుతున్నాం. అటు ఈగవర్నెన్స్ ప్రాజెక్టులను కూడా దక్కించుకోవడంపై దృష్టి పెట్టాం.
మూడేళ్లలో 4 లక్షల మంది టార్గెట్..
2013-14లో వివిధ రాష్ట్రాల్లో సుమారు 25-30 వేల మందికి శిక్షణ కల్పించాలని భావిస్తున్నాం. వచ్చే మూడేళ్లలో మొత్తం మీద 3-4 లక్షల మందికి శిక్షణనివ్వాలని నిర్దేశించుకున్నాం. ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా ఉద్యోగ నైపుణ్యాల్లో శిక్షణ కల్పించే దిశగా కొన్ని యూనివర్సిటీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లపై ఆసక్తి ఉన్న వారు మమ్మల్ని సంప్రతించిన పక్షంలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఏది వారికి అనువైనదిగా ఉంటుందో పరిశీలించి, శిక్షణ కల్పించే ప్రయత్నం చేస్తాం.