ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
- కెప్టెన్‌గా కొనసాగబోనంటూ సంకేతాలు
-
తమ బౌలర్ల కన్నా అశ్విన్, జడేజా బాగా ఆడారని కితాబు
టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం ఎదురుకావడంతో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ ఒకింత నిర్వేదంగా స్పందించాడు. ఈ ఘోర ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో 88 ఓవర్లలో కేవలం 207 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టు పేకమేడలా కుప్పకూలిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 400కుపైగా పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 103 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా నిలకడగా ఆడింది.
కానీ రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్‌తో 48 పరుగులకు ఏడు వికెట్లు తీసుకోవడంతో ఇంగ్లండ్ సైకిల్ స్టాండ్‌లా కుప్పకూలింది. భారత పర్యటనలో ఇంగ్లండ్‌కు ఇది వరుసగా రెండో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి. ఈ ఓటమితో కంగుతిన్న కెప్టెన్ కుక్.. తాను ఇంటికి వెళ్లి కొంత సమయం తీసుకొని కెప్టెన్‌గా కొనసాగేది లేనిది నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు. అదే సమయంలో భారత బౌలర్లు అశ్విన్, జడేజాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్ బౌలర్ల కన్నా వారు అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు. అయితే, తమ జట్టు బౌలర్లు మొయిన్, ఆదిల్, జఫర్‌లను కించపరిచే ఉద్దేశం తన వ్యాఖ్యల వెనుక లేదని వివరణ ఇచ్చాడు.