చదువులు, పెళ్లిళ్లూ కారణమే
* రైతు ఆత్మహత్యలపై సర్కారు
* వాటి వల్లే అప్పులంటూ హైకోర్టులో కౌంటర్
సాక్షి, హైదరాబాద్: రైతులు వారి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్చడానికి, పెళ్లిళ్లు చేయడానికి అధికంగా ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతున్నారని...వారి ఆత్మహత్యలకు ఇదీ ఓ కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అలాగే విచక్షణారహితంగా బోర్లు తవ్వడం, భూముల లీజు, కుటుంబ తగాదాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ప్రైవేటు వ్యక్తుల రుణాల వల్ల కూడా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది.
రైతుల ఆత్మహత్యల నివారణకు తాము ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. రైతుల ఆత్మహత్యల నివారణకు, వారి సంక్షేమం కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకుంటున్న చర్యలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తమను నిందించడానికే పిటిషనర్లు ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తన కౌంటర్‌లో పేర్కొన్నారు.
పిటిషనర్లు తమను నిందించే బదులు అర్థవంతమైన సలహాలు ఇస్తే బాగుండేదన్నారు. రైతుల సంక్షేమం విషయంలో తాము బాధ్యతల నుంచి పారిపోవట్లేదని వివరించారు. ఎప్పటినుంచో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. 2014 జూన్ 2న అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు మరింత లబ్ది చేకూర్చేందుకు ప్రస్తుత పథకాలు సమర్థంగా అమలయ్యేలా చర్యలు ప్రారంభించామని అన్నారు.
కౌంటర్‌లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే...
‘‘రైతులను రుణ విముక్తులను చేయడమే లక్ష్యంగా పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకున్నాం. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ. లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయాలని నిర్ణయించి రూ. 4,250 కోట్లు విడుదల చేసి 35,29,944 రైతు ఖాతాల్లో రూ. 4,039.98 కోట్లు జమ చేశాం. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రెండో దశ రుణ మాఫీ కింద రూ.4086 కోట్లు విడుదల చేశాం.
ఇన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా రైతులు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. 2015 సెప్టెంబర్‌లో జరిగిన రైతు ఆత్మహత్యల ఆధారంగా అధ్యయనం చేయగా 154 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు పత్రికలు, టీవీల్లో కథనాల ద్వారా వెల్లడైంది. ఇందులో 94 కేసులు వ్యవసాయ సమస్యలకు సంబంధించినవని జిల్లా అధికారులు పేర్కొన్నారు. కానీ 41 కేసులు వ్యవసాయానికి చెందినవి కావు, మరో 12 కేసులు ఆత్మహత్యలు కావు. మిగిలిన 7 కేసుల్లో ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నాం.
ఆ ఆత్మహత్యలపై మేం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ చేపడుతుంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలకు పంపుతున్నాం. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాక ప్రైవేటు అప్పులు, పెళ్లిళ్లు, చదువులు, బోర్ల తవ్వకాలపై విచక్షణారహితంగా ఖర్చు చేస్తున్నారు.
దీర్ఘకాలిక అనారోగ్యాలు, కుటుంబ వివాదాలు, గల్ఫ్‌కు వెళ్లేందుకు భారీగా అప్పులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రైతుల ఆత్మహత్యలకు కారణాలు’’ అని సర్కారు తన కౌంటర్‌లో పేర్కొంది.
స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తున్నాం...
‘‘రైతు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శించలేదు. చీప్ పబ్లిసిటీ కోసమే పిటిషనర్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
గతంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని మేము రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచాం. లోన్ సెటిల్‌మెంట్ సీలింగ్‌ను రూ. 50 వేల నుంచి రూ. లక్ష చేశాం. దీనికితోడు పలు అదనపు ప్రయోజనాలు కూడా వర్తింప చేస్తున్నాం. గతేడాది రాష్ట్రంలో 1,347 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనడంలో వాస్తవం లేదు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 782 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 342 కేసులు అసలైనవి.
నేషనల్ క్రైమ్ రికార్డుల ప్రకారం గతేడాది 898 ఆత్మహత్యలు జరిగితే అందులో కేవలం 295 ఆత్మహత్యలు వ్యవసాయ సంబంధితమైనవి. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తున్నాం. ఏ సిఫారసును అమలు చేయలేదో పిటిషనర్లు నిరిష్టంగా చెప్పట్లేదు. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను కొట్టేయండి’’ అని ప్రభుత్వం కోర్టును కోరింది.