కూతురిపై అత్యాచారం: తండ్రికి 1500 ఏళ్ల జైలు
కాలిఫోర్నియా: కూతురు అత్యాచారానికి గురైందని తెలిస్తే ఏ తండ్రైనా ఏం చేస్తాడు? ఆమెను కాటేసినవాడి కోరలు పీకేయాలనుకోడా? కానీ వీడు మాత్రం ఆ ఘటనను అవకాశంగా తీసుకుని కూతురిపై దారుణానికి ఒడిగట్టాడు. ఒకటి, రెండు కాదు.. వారానికి నాలుగైదుసార్లు ఆమెపై విరుచుకుపడుతూ నాలుగేళ్లపాటు నరకం చూపించాడు. ఎలాగోలా తండ్రి చెర నుంచి పారిపోయిన కూతురు.. తండ్రిని శిక్షించాలంటూ కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం తుది తీర్పు వెల్లడించిన కోర్టు.. కనీవినీ ఎరుగని విధంగా నిందితుడికి 1503 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నో ప్రాంతానికి చెందిన టీనేజర్ పై 2009లో ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పుకుని బోరున విలపించిందా అమ్మాయి. కూతురికి అండగా నిలవాల్సిందిపోయి ఆమెను లొంగదీసుకున్నాడా కీచకుడు. 2013 వరకు అలా నరకం అనుభవించిన బాధితురాలు.. చివరికి ఇంటి నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. ఫ్రెస్నో సుపీరియర్ కోర్టు కేసును విచారించింది. 'అప్పుడు నేను చిన్నపిల్లని. నాన్నని ఎదిరించే ధైర్యం లేదు. బాధతో విలవిలా ఏడ్చినా వదిలిపెట్టేవాడు కాదు. పారిపోయి బతకగలనన్న నమ్మకం వచ్చాక ఆ పని చేశా'అని బాధితురాలు కోర్టులో తన గోడు వినిపించింది. ప్రస్తుతం ఆమెకు 23 ఏళ్లు.
అయితే, తాను చేసింది తప్పే కాదని చివరివరకూ వాదించిన నిందితుడి తీరును కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అన్ని సెక్షన్లు కలిపి నిందితుడికి 1503 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. న్యాయమూర్తి తీర్పు చెబుతూ..'కూతురి కౌమారాన్ని ఛిద్రం చేయడమే కాక ఏమాత్రం పశ్చాత్తాపంలేని ఇతను సభ్య సమాజంలో తిరగడానికి అనర్హుడు'అని వ్యాఖ్యానించారు. విచారణ సమయంలో నిందితుడు తప్పు ఒప్పుకుని ఉంటేగనుక 10 నుంచి 30 ఏళ్ల జైలు శిక్ష పడేది. కానీ తప్పు చేశానని అంగీకరించపోవడంతో అతనికి భారీ శిక్ష తప్పలేదు. కాలిఫోర్నియా చరిత్రలోనే ఇదొక అరుదైన తీర్పుగా అక్కడి మీడియా పేర్కొంది.