బాలికపై హత్యాచారం కేసు: కన్నతండ్రే నిందితుడు
రంగారెడ్డి జిల్లాలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ ఘోరమైన కేసులో ఆమె కన్నతండ్రే నిందితుడని పోలీసులు తేల్చారు. ఐదుగురు వ్యక్తులు తనను కొట్టి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హతమార్చారంటూ కట్టుకథలు అల్లి.. ఈ ఘోరానికి పాల్పడ్డాడని చెప్పారు. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన సిమ్రాన్ (14) తండ్రితో కలిసి గురువారం రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదువుతున్న సిమ్రాన్ను బంధువుల ఇంటి నుంచి తీసుకొస్తానంటూ ఆమె తండ్రి మెగావత్ కమాల్ తన మోపెడ్ మీద వెళ్లాడు. (చదవండి - 'తల్లి'డిల్లిన తండా... యాడియే..)
రాత్రి తాము తిరిగి వస్తుండగా ఆటోలోంచి గుర్తు తెలియని దుండగులు వచ్చి తనపై దాడి చేసి.. ఆమెను అపహరించారని, తర్వాత సామూహిక అత్యాచారం చేసి హతమార్చారని అందరినీ నమ్మించాడు. ఈ విషయంలో ఎవరూ తనను అనుమానించకూడదని తలమీద గాయం చేసుకున్నట్లు చూపించాడు. తర్వాత కమాల్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పడంతో తండావాసులు, బంధువులు అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కమాల్ మెగావత్ వ్యవహారశైలిపై పోలీసులకు ముందునుంచి అనుమానంగానే ఉంది. తనను కొట్టి అమ్మాయిని తీసుకెళ్లిపోయారని ఒకసారి, కాదు తాను వాళ్లను ఎదిరించానని మరోసారి చెప్పడం, అతడి తీరు కూడా తేడాగా ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో.. తానే మద్యం మత్తులో కన్నకూతురిపై అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.