పోలీసులకు మతం ఉండదన్న జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి అసిఫాపై లైంగిక దాడి, హత్యోదంతం క్రమంగా రాజకీయ, మత రంగు పులుముకోవడంపై జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ ఎస్‌పీ వైద్ ఆందోళన వ్యక్తం చేశారు. కథువా జిల్లాలోని ఓ గ్రామం నుంచి అసిఫాను కిడ్నాప్ చేసిన దుండగులు వారం రోజుల పాటు ఆమెకు నరకం చూపారు. మత్తుమందులిచ్చి సామూహిక లైంగిక దాడి జరిపి, రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసు దర్యాప్తుపై వస్తున్న విమర్శలను రాష్ట్ర పోలీస్ చీఫ్ వైద్ తోసిపుచ్చారు. పోలీసు అధికారులు హిందువులుగానో..ముస్లింలుగానో పనిచేయరని..వృత్తిపరంగా విధులు నిర్వర్తిస్తారని ఆయన స్పష్టం చేశారు.
స్ధానిక పోలీసులపై తమకు విశ్వాసం లేదని, సీబీఐ దర్యాప్తును కోరుతూ పలువురు నేతలు, జమ్మూకాశ్మీర్ బార్ అసోసియేషన్ చేసిన డిమాండ్లపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్‌కు కేసును అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హిందూ ప్రాబల్య కథువా ప్రాంతంలో ముస్లింలను భయభ్రాంతులను చేసేందుకు ఈ ఘాతుకం జరిగిందని కొన్ని వర్గాలు ఆరోపిస్తుండగా, ఈ ఘటనలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్‌లు చేయరాదని బీజేపీ నేతలు కోరుతున్నారు.
పోలీసులపై స్ధానిక రాజకీయ నేతలు విమర్శలతో విరుచుకుపడుతుండగా, జమ్మూ సర్కార్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు బీజేపీ మంత్రులు వారికి వత్తాసు పలుకుతున్నారు. మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఓ వర్గాన్నే టార్గెట్ చేస్తున్నారని ముస్లింలు పోలీసులపై దాడులకు తెగబడుతుండటంతో పోలీస్ ఉన్నతాధికారి వైద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
పోలీసు అధికారులకు మతంతో సంబంధం ఉండదని, వృత్తిపరమైన బాధ్యతలను వారు నిర్వర్తిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. విచారణ బృందానికి కాశ్మీరీ పండిట్ నేతృత్వం వహిస్తుంటే కాశ్మీరీ ముస్లిం అధికారి సభ్యులుగా ఉన్నారని, విచారణలో సిక్కు వర్గానికి చెందిన వారిని ప్రాసిక్యూటర్లుగా నియమించాలని నిష్పాక్షిక విచారణ కోసం పోలీసులు ప్రభుత్వాన్ని కోరారు. దేశాన్ని నివ్వెరపరిచిన మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య కేసును క్రైమ్ బ్రాంచ్, ప్రత్యేక బృందాలు సమర్ధంగా చేపడుతున్నాయని, కేసులో ప్రమేయం ఉన్న సహచర పోలీసులనూ విడిచిపెట్టలేదని ఎస్‌పీ వైద్ చెప్పారు. సాక్ష్యాలను తారుమారు చేసి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులను అరెస్ట్ చేశామని తెలిపారు. జమ్మూ బార్ అసోసియేషన్‌తో పాటు రాజకీయ పార్టీల నేతలు సీబీఐ విచారణ కోరడాన్ని ప్రస్తావిస్తూ ఎన్నో కేసులను సమర్థవంతంగా చేపట్టిన జమ్మూ పోలీసులపై వారికి విశ్వాసం లేదనడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment