ఖాతా వివరాలు ఆన్‌లైన్‌లో లేకుంటే చర్యలు
ఎన్‌జీవోలకు హోంశాఖ ఆదేశాలు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలు తమ బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఉంచాలని లేకుంటే చర్యలు తప్పవని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఎన్‌జీవోల వార్షిక పన్ను రిటర్నుల హార్డుకాపీలను స్వీకరించబోమని, అవన్నీ ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని కూడా ఆదేశించింది. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యే సంస్థలు లేదా వ్యక్తులు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం–2010 కింద శిక్షార్హులవుతారని హోంశాఖ ప్రకటించింది.
విదేశీ నిధులు పొందే సంస్థలు తమ ఆదాయ వ్యయాల వివరాలు, బ్యాలెన్స్ షీట్‌ల స్కానింగ్ కాపీలను డిజిటల్ సంతకం చేసిన నివేదికతో పాటు ఆర్థిక సంవత్సరం ముగిసిన 9 నెలల్లోపే ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఆదేశించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పలువురు తమ రిటర్నులను హార్డు కాపీల రూపంలో దాఖలు చేశారని, అయితే తాము వాటిని అంగీకరించలేదని పేర్కొంది.