♦ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని కోర్టుకు చెప్పాం
♦ అయినా ప్రయోజనం లేకపోయింది
♦ అది మాకు ఇబ్బందికర పరిస్థితి
♦ ఓటుకు కోట్లు కేసులో హైకోర్టుకు టీ ఏసీబీ న్యాయవాది నివేదన
♦ నేడు ఉండవల్లి వాదనలు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) న్యాయవాది వి.రవికిరణ్‌రావు తెలిపారు. ఇది తమకు ఇబ్బందికర పరిస్థితని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము మెమో ద్వారా ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చామని, అయినా ప్రయోజనం లేకపోయిందని వివరించారు. అంతేకాక ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేసేలా సీఆర్‌పీసీ సెక్షన్ 210 కింద ఆదేశాలు ఇవ్వాలని ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరితే ప్రత్యేక కోర్టు మాత్రం సెక్షన్ 156(3) కింద ఇచ్చిందన్నారు. ఇది ఎంత మాత్రం సరికాదని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ఆదేశాలివ్వడం ఒకే రోజు చేసిందన్నారు. ఈ వాదనలతో ఈ కేసులో ఏసీబీ వాదనలు ముగిసినట్లయింది. బుధవారం ఈ కేసులో తన వాదనలు వినాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపించనున్నారు.
ఆ తరువాత ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఏసీబీ వాదనలకు తిరుగు సమాధానం ఇవ్వనున్నారు. ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై 4 వారా ల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి విచారణ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఏసీబీ తరఫున రవికిరణ్‌రావు సోమవారం నాటి తన వాదనలను మంగళవారం కూడా కొనసాగించారు.
మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది
Published Wed, Nov 16 2016 3:35 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement