ఆమెకు భర్తే సోదరుడయ్యాడు..!
అహ్మదాబాద్: ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడే.. ఆమెకు వరుసకు సోదరుడయ్యాడు. తాము బంధువులమని తెలియక ఈ ప్రేమ జంట వివాహం చేసుకుంది. తన భర్తే ...వరుసకు సోదరుడని పెళ్లయిన తర్వాత నిజం తెలుసుకున్న ఆ యువతి విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్లో ఇటీవల ఈ వింత సంఘటన చోటుచేసుకుంది.
అంబవడికి చెందిన ఓ యువతికి ఓ వివాహ వేడుకలో వస్ట్రాల్కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. అనంతరం వీరిద్దరూ ప్రేమలోపడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. తమ ప్రేమను ఇంట్లో వారు అంగీకరించకపోవచ్చని, వేరే వ్యక్తితో పెళ్లి చేస్తారని ఆ యువతి భయపడింది. ఆ యువతి, ప్రేమికుడు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ పెళ్లి విషయం ఇంట్లో వాళ్లకు చెప్పలేదు.
పెళ్లయిన తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్లో తన భర్త.. తన బంధువని, వరుసకు సోదరుడవుతాడని ఆ యువతికి తెలిసింది. దీంతో ఈ ప్రేమికుల జంట తమ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించారు. వీరిద్దరూ మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. వరుసకు అన్నాచెల్లెలు అని తెలియక పెళ్లి చేసుకున్నామని, తమకు విడాకులు ఇప్పించాల్సిందిగా ఆ యువతి పోలీసులను అభ్యర్థించింది. త్వరలో నిపుణులు వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.