
బీజేపీతోనే తెలంగాణ ఏర్పాటు: నాగం
భారతీయ జనతాపార్టీ మద్దతు లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం అసాధ్యమని ఆ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం నాగం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ వల్లనే తెలంగాణ సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాజ్నాథ్ సింగ్ తమను కోరారని తెలిపారు.
పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు 100 శాతం మద్దతు ఇస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని తాము ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే బీజేపీకి తమ ప్రాంతంలో 10 లోక్సభ స్థానాలు గెలిపించి ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చామన్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ను పోటీ చేసేందుకు ఒప్పించాలని రాజ్నాథ్ సింగ్ను వారు కోరారు.