- 1,500 మందిని ఆహ్వానించాలని ప్రభుత్వ నిర్ణయం
- ప్రధాని చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి 1,500 మంది వీవీఐపీలను, వీఐపీలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 22వ తేదీ విజయదశమి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే పార్లమెంటు సభ్యులందరినీ ఆహ్వానించనుంది. సుప్రీంకోర్టు సీజేతోపాటు రాష్ట్రానికి చెందిన సుప్రీం న్యాయమూర్తులను, హైకోర్టుసీజేతో పాటు, న్యాయమూర్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ ఆహ్వానాలు పంపనున్నారు. రాజధాని శంకుస్థాపనను పెద్ద ఎత్తున నిర్వహించడంతోపాటు సినిమా చిత్రీకరించాలని నిర్ణయించారు. దీన్ని నేషనల్ జియోగ్రఫీ చానల్‌కు అప్పగించాలని సీఆర్‌డీఏ నిర్ణయించడం తెలిసిందే.
సింగపూర్, జపాన్ ప్రధానులు వచ్చే అవకాశం లేదు!
ఇదిలా ఉంటే.. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్, జపాన్ ప్రధానమంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆహ్వానించినప్పటికీ వారు వచ్చే అవకాశం లేదని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశాల ప్రధానమంత్రులను ఆహ్వానిస్తే రారని, దీనికి ఒక విధానం ఉంటుందని ఆ అధికారి తెలిపారు. విదేశాంగ మంత్రిత్వశాఖ లేదా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇతర దేశాల ప్రధానమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాలని, అలాగాక సీఎం ఆహ్వానించడం చెల్లదని ఆ అధికారి అన్నారు. అయితే సింగపూర్, జపాన్ ప్రధానులు రాకపోయినా ఆ దేశాలకు చెందిన కన్సల్టెంట్లు, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
శంకుస్థాపన’కు మహామహులు
Published Wed, Sep 30 2015 1:23 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement