పోలీసులమంటూ రాత్రి వేళల్లో వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను కూకట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు.
భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్): పోలీసులమంటూ రాత్రి వేళల్లో వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను కూకట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై క్రాంతి తెలిపిన వివరాలివీ.. విజయ్‌నగర్‌కాలనీకి చెందిన షేక్ కరీం(22), మాధవరంనగర్ కాలనీకి చెందిన సత్యనారాయణ (30), బాగ్‌అమీర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ (24), మాధవరంనగర్‌కు చెందిన గోపాలకృష్ణ (30) స్నేహితులు. అయితే, రాత్రి సమయాల్లో వీరంతా మద్యం తాగి వాహనదారులను బెదిరింపులకు గురిచేసేవారు. బుధవారం రాత్రి పటేల్‌కుంట పార్కు సమీపంలో ద్విచక్ర వాహనదారులను ఆపి వాహనం పత్రాలు చూపించాలని, లేదంటే పక్కన ఎస్‌ఐ ఉన్నాడని బెదిరించేవారు. ఈ క్రమంలోనే జగద్గిరిగుట్టకు చెందిన రాజేష్ ఉషాముళ్లపూడి రోడ్డు నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే క్రమంలో అతని బైక్ ఆపారు.
అయితే, అతని వాహనం పేపర్లు అన్నీ సక్రమంగా ఉండటంతో హెల్మెట్‌లేదని వెయ్యి రూపాయలు అడిగారు. తన వద్ద డబ్బులు లేవు అనడంతో పర్సు తీయమన్నారు. పర్సులో ఉన్న 4 వేలతో పాటు అతని ఏటీఎం కార్డు లాక్కొని భాగ్యనగర్‌కాలనీలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి పిన్ నంబర్ అడిగారు. అతడు ఎంతకూ పిన్ నెంబర్ చెప్పకపోవడంతో ఏటీఎం సెక్యూరిటీగార్డుతో వాదనకు దిగారు. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 వేలతో పాటు ఒక సెల్‌ఫోన్, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.