నేటి నుంచి ‘పల్లెప్రగతి’
కౌడిపల్లిలో పైలాన్‌ను ఆవిష్కరించనున్న కేటీఆర్
కార్యక్రమం అమలుకు 150 మండలాల ఎంపిక
పేదల జీవనోపాధి కోసం రూ. 642 కోట్లు
హైదరాబాద్: రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఏర్పాటు చేసిన ‘పల్లె ప్రగతి’ పైలాన్‌ను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారకరామారావు శనివారం ఆవిష్కరించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఐదేళ్లపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు రూ. 450 కోట్ల ఆర్థిక సాయం అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 192 కోట్లు (మొత్తంగా రూ. 642 కోట్లు) వెచ్చించనున్నారు. తొలి విడ తగా రాష్ట్రంలో వెనుకబడిన 150 మండలాలను ఎంపిక చేసిన అధికారులు ఆయా ప్రాంతాల్లో పేద వర్గాలకు జీవనోపాధి కల్పించడం, వారిని మానవ వనరుల అభివృద్ధికి చేరువ చేయడం, సామాజిక హక్కులు కల్పించడం వంటి కార్యక్రమాలను చేపడతారు. ఎంపిక చేసిన మండలాల్లో చిన్న, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో వాల్యూ చైన్ డెవలప్‌మెంట్, హ్యూమన్ డెవలప్‌మెంట్, డిజిటల్ లోకల్ గవర్నమెంట్, ఐసీటీ-టీఏ భాగస్వామ్యం, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ సపోర్టు కార్యక్రమాలను నిర్వహించనుంది. ప్రాజెక్టును అమలు చేసేందుకు ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ, అమలు, సమీక్ష, పథకం నిర్వహణ కమిటీ లు సెర్ప్ అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తాయి.
లక్ష్యాలు ఇవీ..
ఎంపిక చేసిన మండలాల్లో 2.5 లక్షల మంది పేద వ్యవసాయదారుల జీవనోపాధి, ఆదాయాన్ని పెంపొందించడం
2.5 లక్షల కుటుంబాలకు సరైన ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత వంటి అంశాల్లో మానవ వనరుల అభివృద్ధి
ఐదు లక్షల కుటుంబాలకు ప్రభుత్వ వ్యవస్థ ద్వారా మెరుగైన అవకాశాలు కల్పించడం
ఆసరా, ఉపాధి హామీ వంటి పథకాల్లో లబ్ధిదారుల నమోదు, నగదు చెల్లింపుల ద్వారా సామాజిక భద్రత హక్కు కల్పించడం