Published
Tue, Feb 28 2017 1:46 PM
| Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
అమెరికా కంపెనీ పెద్దమనసు
అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలుగు ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయనకు అండగా నిలబడేందుకు ఆయన పనిచేసే కంపెనీ ముందుకొచ్చింది. శ్రీనివాస్ హెచ్1బి వీసాతో అమెరికాలో పనిచేసేందుకు వెళ్లారు. అక్కడ గార్మిన్ అనే కంపెనీలో ఆయన పనిచేసేవారు. అయితే ఇప్పుడు ఆయన లేకపోవడంతో.. ఆయన వద్దకు వెళ్లేందుకు వీసా తీసుకుని ఉంటున్న సునయన శ్రీనివాస్ అంత్యక్రియల తర్వాత మళ్లీ అమెరికా వెళ్లేందుకు వీలుండదు. ఈ విషయాన్ని ఆమె అమెరికాలో ఉన్నప్పుడే నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పి.. గార్మిన్ కంపెనీ తాను మళ్లీ అమెరికా వచ్చేందుకు, ఇక్కడ తాను శ్రీనివాస్ కలలను నెరవేర్చేందుకు తాను ఎంచుకున్న రంగంలో విజయవంతం అయ్యేందుకు సాయపడాలని కోరారు.
శ్రీనివాస్‌కు హెచ్1బి వీసా ఉండగా, సునయనకు హెచ్4 వీసా ఉంది. దాని ఆధారంగా ఆమె అమెరికాలో ఉండేందుకు, పనిచేసేందుకు వీలుంటుంది. ఇప్పుడు సునయన అమెరికా వచ్చేందుకు వీలుగా తగిన వీసా సిద్ధం చేసేందుకు గార్మిన్ న్యాయ ప్రతినిధులు, వాళ్ల ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఉచితంగా న్యాయసహాయం అందించేందుకు బ్రయాన్ కేవ్ అనే న్యాయసంస్థ సహా పలు సంస్థలు ముందుకు వచ్చినట్లు గార్మిన్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ లారీ మినార్డ్ చెప్పారు. శ్రీనివాస్ సహా భారతదేశం, మరికొన్ని ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు తమ కంపెనీలో పనిచేసేందుకు వీలుగా గార్మిన్ కంపెనీ స్పాన్సర్‌షిప్ అందించింది. ఇప్పుడు సునయనకు కూడా తాము అన్ని రకాలుగా సాయం చేస్తామని, ఆమె అమెరికాలోనే ఉండి పని చేసుకోడానికి అవకాశం కల్పిస్తామని గార్మిన్ ప్రతినిధులు చెప్పారు.