తమిళసినిమా: విశాల్ తాజా చిత్రం లాఠీచార్జ్. సునయన నాయకిగా నటించిన ఇందులో ప్రభు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్. వినోద్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నటులు నందా, రమణ కలిసి రాణా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ భారీ చిత్రానికి సుబ్రమణ్యం చాయాగ్రహణను, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో రూపొందింది. ఇందులో విశాల్ పోలీస్ కానిస్టేబుల్ గా నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
స్థానిక వడపళనిలోని పలోజా థియేటర్‌లో నిర్వహించారు. మాజీ డీజీపీ జాంగిత్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ ముఖ్య అతిథులుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతుండగా అభిమానులు పురట్చి దళపతి అని హర్షధ్వానాలతో ఘోషించారు. దీంతో విశాల్ స్పందిస్తూ తాను దళపతి కాదు, పురట్చి దళపతినీ కాదని.. విశాల్‌ను మాత్రమే అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ కానిస్టేబుల్‌కు సెల్యూట్ అంటూ జాంగిత్ విశాల్‌కు సెల్యూట్ చేశారు.
అనంతరం విశాల్ మాట్లాడుతూ.. దర్శకుడు వినోద్ కుమార్ ఈ కథను చెప్పి ఎనిమిది రోజుల్లోనే సమ్మతం పొందారన్నారు. తను కథ చెప్పడానికి ముందే ఇందులో తనది 8 ఏళ్ల బాలుడికి తండ్రి పాత్ర అని తెలిపారన్నారు. కథ విన్న తర్వాత తాను ఎలాంటి అనుభూతికి లోనైయ్యానో, చిత్రం చూసిన తర్వాత ప్రేక్షకులు అలాంటి అనుభూతికే గురవుతారన్నారు. తాను ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నింటి కంటే భారీ బడ్జెట్ కథా చిత్రం ఇదని చెప్పారు.
ఈ చిత్రంలో పనిచేసిన ఇద్దరికి మంచి పేరు వస్తుందన్నారు అందులో ఒకరు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, రెండో వ్యక్తి ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ అని తెలిపారు. చిత్రంలో క్లైమాక్స్ పోరాట దృశ్యాలను 80 రోజుల పాటు చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ సన్నివేశాల సమయంలో చాలాసార్లు గాయపడ్డానని చెప్పారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ఈ నెల 22వ తేదీ, హిందీ వెర్షన్ 30వ తేదీ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment