స్వలింగ సంపర్కం నేరమే: సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు, స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టేసింది. ఈ మేరకు వివిధ సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలు దాఖలు చేసిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు ఆమోదించింది.
గే సెక్స్ చట్టవిరుద్ధమని, అది నేరమని, జీవితఖైదు వరకు విధించగలిగేంత శిక్షార్హమని చెప్పే ఐపీసీ సెక్షన్ 377లో రాజ్యాంగపరంగా ఎలాంటి సమస్యా లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ సెక్షన్ను ఐపీసీ నుంచి తొలగించాలా లేదా అనే విషయాన్ని శాసన వ్యవస్థ చూసుకోవాలని తెలిపింది.
స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలకు ఇది శరాఘాతంలాగే పరిణమిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఇద్దరి అంగీకారంతో జరిగే హోమోసెక్సువాలిటీ నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం ఆ తీర్పును కొట్టేసింది. స్వలింగ సంపర్కం అనేది మన దేశంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలకు విరుద్ధమని వివిధ సంస్థలు కోర్టులో వాదించాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టేసినా, ఈ వివాదాస్పద అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం పార్లమెంటేనంటూ బంతిని శాసనవ్యవస్థ కోర్టులోకి నెట్టేసింది.