
సీట్లు ఓకే.. ఓట్లేవి..?
మహా నగరంలో మహిళా ఓటర్ల సంఖ్య మరింతగా పడిపోయింది. తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో...
గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు. ‘ఆకాశంలో సగం..ఎన్నికల్లోనూ సగం..’ అంటూ అంతా మురిసిపోయారు.
అన్ని వర్గాలూ హర్షం వ్యక్తం చేశాయి. పోటాపోటీగా మహిళా అభ్యర్థులూ ఎన్నికల రంగంలోకి దూకారు.
ఇంత వరకు బాగానే ఉంది...ఓట్ల శాతం విషయానికొస్తే మాత్రం పురుషులదే ఆధిక్యం కన్పిస్తోంది.
గ్రేటర్ పరిధిలో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 930 మంది మహిళా ఓటర్లు మాత్రమే ఉన్నట్లు లెక్కలు తేల్చాయి.
- సాక్షి , సిటీబ్యూరో
* 150 డివిజన్లలోనూ పురుషాధిక్యం
* గ్రేటర్‌లో ఐదేళ్లలో..మరింత తగ్గిన మహిళా ఓటర్లు
* 930-1000కి చేరిన స్త్రీ, పురుష ఓటరు నిష్పత్తి
మహా నగరంలో మహిళా ఓటర్ల సంఖ్య మరింతగా పడిపోయింది. తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో వెయ్యి మంది పురుషులకు కేవలం 930 మంది మహిళా ఓటర్లే నమోదయ్యారు. 2011 జ నాభా లెక్కలతో పోలిస్తే కారణాలు ఏవైనా మహిళా ఓటర్ల సంఖ్య తగ్గటం ఆందోళన చెందే అంశమే.
మహానగర పాలక మండలి(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో 50 శాతం స్థానాలు(75 డివిజన్లు) తొలిసారిగా మహిళలకు కేటాయించిన సంతోషం అలా ఉంచితే, 2011 జ నాభా లెక్కల్లో 954-1000 స్త్రీ పురుష నిష్పత్తి ఉండగా, తాజా ఓటర్ల జాబితాకు వచ్చే సరికి మరో 24 మంది మహిళలు తగ్గిపోయారు. మొత్తంగా చూస్తే పురుషులు - స్త్రీ ఓటర్ల మధ్య నగరంలో సుమారు ఆరున్నర శాతం అంతరం ఉండగా, కొన్ని డివిజన్లలో అయితే ఆ సంఖ్య పది శాతాన్ని దాటిపోయింది.
శివారులో మరీ అధ్వానం
మహిళా ఓటర్ల పరిస్థితి శివారు ప్రాంతాల్లో ఘోరంగా పడిపోయింది. ముఖ్యంగా సుభాష్‌నగర్‌లో మహిళల కంటే పురుషులు 14 వేల పైచిలుకు ఎక్కవగా నమోదయ్యారు. మైలార్‌దేవ్‌పల్లి, కొండాపూర్‌లలో 11 వేల చొప్పున, సూరారంలో 8 వేలు తక్కువగా ఉన్నారు. ఇంకా బేగంబజార్, భోలక్‌పూర్, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, ఫతేనగర్‌లలోనూ స్త్రీ- పురుష ఓటర్ల మధ్య అంతరం భారీగా నమోదయింది. నగరం మొత్తంగా చూస్తే మొత్తం ఓటర్లు 74,23,980 మంది ఉండగా వీరిలో పురుషులు 53.46 శాతం, మహిళలు 46.5 శాతం మంది ఉన్నారు. 1063 మంది ఓటర్లు ఇతరుల కేటగిరీలో ఉన్నారు. వాస్తవంగా జనాభా పరంగా కూడా మహిళల శాతం తక్కువగా ఉంటోంది. ఇదే పరిస్థితి ఓటర్లలోనూ కన్పిస్తోంది.
వివక్షపై అంతా స్పందించాలి
రాజధానిలో స్త్రీ-పురుషుల నిష్పత్తి మధ్య అంతరం భారీగా పెరగటం ఆందోళన కలిగించే అంశం. ఆడపిల్ల అంటే భారమన్న అభిప్రాయంతో ఇంకా అబార్షన్లు జరుగుతున్న ఘటనలు అనేకం. ఈ పరిస్థితిపై సభ్య సమాజం అంతా స్పందించాలి. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం సమాజానికి ఎంతైనా ఉంది.
- అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్ సభ్యులు
వచ్చే పాలకవర్గం ప్రతిన బూనాలి
మహానగరంలో ఆడపిల్లల సంఖ్యను పురుషులతో సమానంగా పెంచేందుకు వచ్చే జీహెచ్‌ఎంసీ పాలకవర్గం ప్రతినబూనాలి. ‘ఆడపిల్ల అవనికి భారం కాదు..అందం’ అన్న నినాదం జీహెచ్‌ఎంసీ తొలి సమావేశంలోనే మారుమోగాలి. ఆ వెంటనే కార్యాచరణ మొదలు కావాలి. ఈ విషయంలో పౌరులు సైతం స్పందించాలి.
- డాక్టర్ పద్మజారెడ్డి, నాట్యగురువు