
'చంద్రబాబు, కొత్తపల్లి గీత కుమ్మక్కయ్యారు'
విశాఖ : విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ తవ్వకాలు జరిపితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని పాడేరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. బాక్సైట్ తవ్వకాలు చేపడితే గిరిజన ఎమ్మెల్యేగా గిరిజన హక్కుల ఉల్లంఘటన కింద తీవ్ర నిరసన తెలియచేస్తామని ఆమె బుధవారమిక్కడ హెచ్చరించారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశామన్నారు.
వైఎస్ఆర్ సీపీ ఎంపీ అయినప్పటికీ టీడీపీతో కొత్తపల్లి గీత కుమ్మక్కయ్యారని, అది ఆమె అవకాశ వాదానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు, కొత్తపల్లి గీత ఇద్దరూ కుమ్మక్కై గిరిజన ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని గిడ్డి ఈశ్వరి విమర్శించారు. ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదు ఎస్సీ అని స్క్రూటినీ కమిటీ నివేదిక ఇచ్చినా నేటికీ చంద్రబాబు సర్కార్ ఆ విషయాన్ని బహిరంగం చేయలేదని ఆమె అన్నారు.