దక్కని పాడేరు టీడీపీ టికెట్
ఝలక్ ఇచ్చిన చంద్రబాబు
రగిలిపోతున్న అనుచరులు
గ్రూపులుగా విడిపోయిన ఆ పార్టీ శ్రేణులు
వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొంది పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి భంగపాటు తప్పలేదు. పాడేరు సీటు కోసం విశ్వ ప్రయత్నం చేసిన ఆమెను కూరలో కరివేపాకు మాదిరిగా చంద్రబాబు పక్కన పడేశారు. ఆమెకు కాకుండా మరొకరికి టికెట్ కేటాయించడంతో ఆయన తీరుపై అనుచరులంతా రగిలిపోతున్నారు. వీరంతా పార్టీ ప్రకటించిన అభ్యర్థికి సహకరించేది లేదని స్పష్టం చేశారు.
సాక్షి, పాడేరు: టీడీపీ పాడేరు ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. గత ఏడేళ్లుగా టీడీపీ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టిన ఆమెకు పాడేరు అసెంబ్లీ టికెట్ ఇస్తారని అనుచరులంతా ఆశించారు. ఈ సీటు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆమెను చంద్రబాబు పక్కనబెట్టారు. దీంతో ఆమె అనుచరులు, టీడీపీ శ్రేణులు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు.
ఈ సీటును తొలుత బీజేపీకి కేటాయించినట్టు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి టీడీపీలో ఈశ్వరితో పాటు మరికొంతమంది ఆశావహులంతా చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. మొన్నటి వరకు బీజేపీ పోటీ చేస్తుందని భావించినప్పటికీ అరకులోయ అసెంబ్లీ స్థానాన్ని తీసుకున్న ఆ పార్టీ పాడేరు సీటును టీడీపీకి వదిలేసింది. దీంతో మళ్లీ గిడ్డి ఈశ్వరి పాడేరు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆమెతోపాటు కిల్లు రమేష్‌నాయుడు, కొట్టగుళ్లి సుబ్బారావు, ఎంవీవీఎస్ ప్రసాద్ కూడా ప్రయత్నించారు. వీరిలో కిల్లు రమేష్‌నాయుడు పేరును టీడీపీ ప్రకటించడంతో గిడ్డి ఈశ్వరితోపాటు మిగిలిన వారంతా కంగుతిన్నారు.
ఆ రోజు వెన్నుపోటుకు బదులా..?
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో ఫ్యాన్ గుర్తుపై 2014 ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి 2018లో పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. సంతల్లో పశువుల మాదిరిగా చంద్రబాబు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఆమె కూడా ప్యాకేజీకి ఆశపడి పార్టీ ఫిరాయించారు. నమ్మి సీటు ఇచ్చిన వైఎస్సార్‌సీపీకి, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆమె ద్రోహం చేశారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో పాడేరు టీడీపీ టికెట్ సీటు గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు ఇచ్చినప్పటికీ ప్రజలు ఆదరించలేదు. అప్పటిలో ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. వైఎస్సార్‌సీపీకి ఆమె చేసిన ద్రోహానికి ప్రజలు ఓటుతో తగిన గుణ పాఠం చెప్పారు. ఆ తరువాత టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా మరో వర్గం పార్టీ కార్యక్రమాలు చేపట్టింది.
దీంతో పార్టీ శ్రేణులు గ్రూపు లుగా విడిపోయారు. గిడ్డి వ్యతిరేక వర్గీయులంతా నారా లోకేష్‌తో టచ్‌లో ఉండేవారు. ప్రస్తుతం పాడేరు టికెట్ పొందిన కిల్లు రమేష్‌నాయుడు కూడా నారా లోకేష్‌ను తరచూ కలుస్తుండేవారని తెలిసింది. గత నెలలో పాడేరు వచ్చిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఈశ్వరికి పాడేరు సీటు కోసం హామీ ఇచ్చారు. ఆమె పర్యటన ఏర్పాట్లకు ఈశ్వరి భారీగానే ఖర్చు పెట్టారు. కానీ ఆమె సీటు విషయంలో భువనేశ్వరి కూడా ఏమీ చేయలేక పోవడంతో గిడ్డి ఈశ్వరికి భంగపాటు తప్పలేదు. సీటు కేటాయింపు విషయంలో పార్టీ నిర్ణయం మార్చు కోకుంటే టీడీపీ అభ్యర్థికి సహకరించేది లేదని పార్టీ అధిష్టానాన్ని గిడ్డి అనుచరులు హెచ్చరించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment