శృంగారానికి నిరాకరించిందని.. పొడిచి చంపేశారు!
గుజరాత్లో దారుణం జరిగింది. తమతో శృంగారానికి నిరాకరించిందన్న కారణంతో.. బాగా తాగి ఉన్న కొంతమంది గూండాలు 22 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ దాడిలో ఆమె స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నారన్పురా రైల్వే క్రాసింగ్ సమీపంలో జరిగింది. గాయపడిన యువకుడు, మృతురాలి తల్లిదండ్రులు ఏమైనా చెబితే దాన్నిబట్టి కేసు దర్యాప్తు ముందడుగు వేస్తుందని పోలీసులు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని రాయగఢ్ ప్రాంతానికి చెందిన బీర్బల్ ప్రసాద్ (26) అనే యువకుడికి అహ్మదాబాద్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో కొంతకాలం క్రితం నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్నాళ్ల తర్వాత పెళ్లికూతురి తండ్రి.. ఆ సంబంధం వద్దనుకుని నిశ్చితార్థం రద్దుచేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత కూడా ఆమె బీర్బల్తో స్నేహం కొనసాగిస్తోంది. అతడు అప్పుడప్పుడు అహ్మదాబాద్ వచ్చి వెళ్తుండేవాడు. అలాగే వచ్చి రాత్రి కాసేపు మాట్లాడుకున్న తర్వాత.. తిరిగి 10.30 ప్రాంతంలో వెళ్తుండగా ఆమె పీజీ అకామడేషన్ తలుపులు వేసి ఉన్నాయి. దాంతో మరికాసేపు వాళ్లు మాట్లాడుకుంటూ గడిపారు. అదే సమయంలో తాగిఉన్న నలుగురు అక్కడకు వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. తమతో శృంగారానికి రమ్మని పిలవగా, ఆమె నిరాకరించింది, స్నేహితుడు కూడా వాళ్లను అడ్డుకున్నాడు. వెంటనే వాళ్లు ఆమెను, అతడిని కత్తితో పొడిచారు. ఆమెను పలుమార్లు పొడవడంతో తీవ్రంగా గాయపడింది. బీర్బల్ పోలీసులకు ఫోన్ చేయగా, వారు ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.