సీసీ కెమెరా ఫుటేజీలివ్వండి | Give the Cc camer footage | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరా ఫుటేజీలివ్వండి

Published Sun, Dec 18 2016 3:21 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

సీసీ కెమెరా ఫుటేజీలివ్వండి - Sakshi

సీసీ కెమెరా ఫుటేజీలివ్వండి

ఏపీ, తెలంగాణల్లోని బ్యాంకులకు ఆర్బీఐ నోటీసులు
- అంతర్గతంగా కట్టలు మార్చారని బ్యాంకుల సిబ్బందిపై లక్షల్లో ఫిర్యాదులు
- ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్న ఆర్బీఐ


సాక్షి, అమరావతి: నోట్ల రద్దు తర్వాత జరిగిన లావాదేవీలపై సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బ్యాంకులకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నోటీసులు పంపింది. ఇప్పటికే వందలాది బ్యాంకులకు నోటీసులు అందాయి. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నగదు చెల్లింపులతో పాటు నగదు మార్పిడి వ్యవహారాల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. క్యూల్లో గంటలుకొద్దీ నుంచున్నా నోట్లు దొరక్క సామాన్యులు ఇబ్బంది పడుతుంటే.. కొంతమంది మాత్రం బ్యాంకు సిబ్బంది సహకారంతో పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని వార్తలొచ్చాయి. బ్యాంకుల వ్యవహారాలపై ఆర్బీఐకి పలువురు ఖాతాదారులు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులపై స్పందించిన ఆర్బీఐ.. క్యాషియర్, మేనేజర్‌ క్యాబిన్లకు, లాకర్‌ రూం తదితర ప్రధాన చెల్లింపుల గదులకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించినట్లు తెలిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అంటే సుమారు 7 గంటల పాటు రికార్డయిన వివరాలన్నీ సీడీల రూపంలో ఇవ్వాలని కోరారు. ఈ ఫుటేజీల్లో ఆధారంగా కస్టమర్లకు చెల్లింపులు, డిపాజిట్లు తదితర వివరాలు పరిశీలించనున్నట్టు తెలిసింది. నగదు వ్యవహారాల్లో  తేడా వస్తే ఆయా బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ నుంచి వచ్చిన ఆదేశాల్లో ఉన్నట్టు బ్యాంకర్లు చెప్పారు.

బ్యాంకర్ల గుండెల్లో గుబులు
ఆర్బీఐ నుంచి వచ్చిన ఆదేశాలతో బ్యాంకు మేనేజర్ల గుండెల్లో గుబులు మొదలైంది. 20 నుంచి 30 శాతం కమీషన్లకు నగదు మార్చిన ఘటనలున్న నేపథ్యం లో ఆయా మేనేజర్ల బండారం ఇప్పుడు బయటప డుతుందేమోనని భయపడుతున్నారు. ఇదిలా ఉండ గా ఇప్పటికే సిబ్బంది కొరత, ఖాతాదారుల ఒత్తిడి తో సతమతమవుతున్న తమకు సీసీ ఫుటేజీల రికార్డులు ఇవ్వాలంటే తలకు మించిన భార మవుతోందని బ్యాంకర్లు అంటున్నారు. ఇన్ని రోజు ల ఫుటేజీలు ఇవ్వాలంటే చాలా సమయం పడుతుం దని చెబుతున్నారు. డిసెంబర్‌ 30 వరకూ కూడా సీసీ కెమెరా ఫుటేజీలు కావాలని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకులకు నోటీసులు వెళ్లినట్టు తెలిసింది.

30 లక్షలకు పైగా ఫిర్యాదులు
బ్యాంకుల్లో జరిగిన మోసాలపై జనం తీవ్రంగా స్పందించారు. తమ ఆగ్రహాన్ని ఈ–మెయిళ్ల రూపంలో వెల్లడించారు. ఆర్బీఐ ఫిర్యాదుల విభాగానికి 30 లక్షలకు పైగా ఈ–మెయిల్‌ ఫిర్యాదులు వచ్చినట్టు ఆర్బీఐ అధికార వర్గాల సమాచారం. కొంతమంది ఫిర్యాదుదారులు బ్యాంకుల్లో జరిగిన మోసాలను సెల్‌ఫోన్‌ల ద్వారా వీడియోలు తీసి పంపించగా, బ్యాంకుల వద్ద నగదు అందక వృద్ధులు, మహిళల బాధలను మరికొంతమంది వీడియోల రూపంలో పంపించారు. కొంతమందైతే పోలీసుల దౌర్జన్యాన్ని కూడా చిత్రీకరించి ఆర్బీఐకి పంపించినట్టు అధికారులు చెప్పారు. ఈ ఫిర్యాదులు వచ్చినందుకే చర్యలకు ఉపక్రమించినట్టు కూడా ఆర్బీఐ అధికార వర్గాలు చెబుతున్నాయి.

లెడ్జర్లతో ‘తెల్ల’రంగు!
కేంద్రం ప్రకటించిన నోట్ల రద్దు చర్య రాజకీయ పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ‘నోట్ల రద్దు వల్ల పార్టీలకు నగదు ప్రవాహం తాత్కాలికంగా తగ్గుతుంది కానీ.. అవి ఏ మాత్రం నష్టపోవు. ఒక లెడ్జర్‌ను రాసి.. పాత తేదీలతో గుర్తు తెలియని దాతల నుంచి నగదు విరాళాలు వచ్చినట్లు నమోదు చేసుకుంటే చాలు..’ అని ఒక ప్రముఖ పార్టీకి చెందిన సీనియర్‌ నేత పేర్కొన్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ వద్ద రూ.100 కోట్ల నగదు పాత నోట్ల రూపంలో ఉంటే... ఓ 50 వేల మంది గుర్తుతెలియని వ్యక్తులు తమకు రూ.19,000 చొప్పున విరాళాలు ఇచ్చారని లెడ్జర్‌లో రాసుకుని, సొమ్మును బ్యాంకుల్లో జమ చేసి తెల్లధనంగా మార్చుకోవచ్చు. దీంతో నోట్ల రద్దు కారణంగా చాలా మంది కాంట్రాక్టర్లు, బిల్డర్లు, బ్యూరోక్రాట్లు కూడా తమ వద్ద ఉన్న పాత నోట్ల నల్లధనాన్ని అధికార పార్టీలకు విరాళాలుగా ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయని చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement