
గ్లో‘బుల్’ ర్యాలీ..!
చైనా సంస్కరణలు, అమెరికా ఫెడ్ ఉద్దీపన అంచనాల కారణంగా ప్రపంచ మార్కెట్ల ర్యాలీ సాగించిన ప్రభావంతో భారత్ స్టాక్ సూచీలు కూడా ఉవ్వెత్తున ఎగిసాయి. సోమవారం 171 పాయింట్ల గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ రోజంతా అలుపెరగని ర్యాలీ సాగించి 20,851 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 451 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ 133 పాయింట్ల పెరుగుదలతో 6,189 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. స్టాక్ సూచీలు ఇంతభారీగా పెరగడం నెలరోజుల తర్వాత ఇదే ప్రధమం. దాంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ. లక్ష కోట్లకుపైగా పెరిగింది. తాజా ర్యాలీతో స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీల విలువ రూ. 67,94,300 కోట్లకు చేరింది. దేశీయ, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులపై అనుమానంతో కొద్దిరోజుల క్రితం ఇన్వెస్టర్లు షార్ట్ చేసిన ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు లార్సన్ అండ్ టూబ్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ కౌంటర్లలో కవరింగ్ జరగడంతో సూచీల భారీ ర్యాలీ సాధ్యపడింది. రూపాయి మారకపు విలువ నాటకీయంగా 62,41 స్థాయికి మెరుగుపడటం సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అమలుచేస్తున్న ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని వచ్చే మార్చి వరకూ ఉపసంహరించబోదన్న అంచనాలు ఏర్పడటంతో పాటు చైనా కమ్యూనిస్టు నాయకత్వం పలు ఆర్థిక, సామాజిక సంస్కరణలను ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గత శుక్రవారం రాత్రి కొత్త రికార్డుస్థాయికి అమెరికా మార్కెట్లు చేరడంతో సోమవారం ప్రధాన ఆసియా సూచీలైన హాంకాంగ్ హాంగ్‌సెంగ్, చైనా షాంఘై, ఇండోనేసియా జకార్తా కాంపోజిట్‌లు 2-3 శాతం మధ్య పెరిగాయి. ఇదే బాటలో యూరప్‌లోని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు కూడా ర్యాలీ జరిపాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా ఎస్ అండ్ పీ, డోజోన్స్ ఇండెక్స్‌లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి.
విదేశీ నిధుల ప్రవాహం...
ఇక దేశీ మార్కెట్లో క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లు బాగా పెరిగాయి. దాంతో ఈ రంగాల సూచీలు 3 శాతంపైగా ఎగిసాయి. ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీలు 4 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు 2 శాతం, ఐటీసీ 3.5 శాతం రిలయన్స్ 2 శాతం చొప్పున పెరిగాయి. మెటల్ షేర్లు హిందాల్కో, టాటా స్టీల్ 3.5 శాతం మేర ర్యాలీ జరిపాయి. కొద్దిరోజులుగా లాభాల స్వీకరణకు లోనవుతున్న ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రాలు కూడా స్వల్పంగా పెరిగాయి. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 1.5 శాతం పెరుగుదలతో 52 వారాల గరిష్టస్థాయి 3,405 వద్ద ముగిసింది. మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్లు 4-7 శాతం మధ్య ఎగిసాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 26 షేర్లు పాజిటివ్‌గా ముగియడం విశేషం. కొద్దిరోజులుగా నెమ్మదించిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐలు) కొనుగోళ్లు తిరిగి స్పీడందుకున్నాయి. తాజాగా ఎఫ్‌ఐఐలు రూ. 1,159 కోట్ల విలువైన పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ.655 కోట్లు వెనక్కి తీసుకున్నాయి.
బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ బిల్డప్
నగదు విభాగంలో బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లతో పాటు డెరివేటివ్ విభాగంలో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 3 శాతంపైగా పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో తాజాగా 51 వేల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 16.36 లక్షల షేర్లకు చేరింది. లాంగ్ బిల్డప్‌ను సూచిస్తూ స్పాట్ బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం రూ. 54 వరకూ పెరిగింది. స్పాట్ బ్యాంక్ నిఫ్టీ 11,142 పాయింట్ల వద్ద ముగియగా, ఫ్యూచర్ 11,196 వద్ద క్లోజయ్యింది. 11,000 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరగడంతో ఈ కాల్ ఆప్షన్ నుంచి 23 వేల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 77 వేల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ రెండు ఆప్షన్లలోనూ దాదాపు 2 లక్షల షేర్ల వరకూ ఓఐ వుంది. 11,200 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ జరగడంతో ఈ ఆప్షన్లో ఓఐ 1.34 లక్షల షేర్లకు పెరిగినప్పటికీ, 11,500 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్‌తో ఓఐ 2.31 లక్షల షేర్లకు తగ్గింది. సమీప భవిష్యత్తులో బ్యాంక్ నిఫ్టీ 11,200 స్థాయిని దాటితే 11,500 వరకూ పెరగవచ్చని ఈ డేటా సూచిస్తున్నది.