'నేనిక శపించను'
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె గురువారం తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కారు. జపాన్ నుంచి తిరిగి స్వదేశానికి వస్తూ దవావో నగరంలో మాట్లాడారు. విమానంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో తాను మాత్రం ఆకాశం వైపు చూశానని చెప్పారు. ఆ సమయంలో తానొక గొంతును విన్నానని.. భవిష్యత్తులో నిరర్ధక వ్యాఖ్యలు మానుకోపోతే విమానాన్ని ఇప్పుడే కూల్చేస్తాననే మాటలు ఆకాశవాణి రూపంలో తనకు వినిపించినట్లు చెప్పారు.
మీరెవరు? అని ప్రశ్నించగా దేవుడనే సమాధానం వచ్చిందని తెలిపారు. ఇక నుంచి తాను ఎవరినీ దూషిస్తూ మాట్లాడనని, శపించనని దేవుడికి ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. దేవుడికి ప్రమాణం చేస్తే ఫిలిప్పీన్ ప్రజలందరికీ ప్రమాణం చేసినట్లేనని అన్నారు. డ్యుటెర్టె సంభాషణ గురించి చెప్పడం ముగియగానే ఆ ప్రదేశం అంతా చప్పట్లతో హోరెత్తింది. దీనిపై స్పందిచిన డ్యుటెర్టె ఎక్కువగా చప్పట్లు కొట్టొద్దని దీన్ని కూడా రాద్దాంతం చేస్తారని అన్నారు.
కాగా, ఈ ఏడాది జూన్ చివరిలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దేశంలో డ్రగ్స్ మాఫియాపై డ్యుటెర్టె ఉక్కుపాదం మోపారు. ఆయన చర్యలకు వేల సంఖ్యలో డ్రగ్ డీలర్లు మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ ను వెలియాలి తనయుడు అంటూ డ్యుటెర్టె చేసిన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.