సిటీలో 2700 కోట్ల గోల్డ్ గోల్‌మాల్!
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసిన తర్వాత హైదరాబాద్ నగరంలో కనీవినీ ఎరుగనిరీతిలో భారీగా బంగారం కొనుగోళ్లు జరిగినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించినట్లు తెలుస్తోంది. నవంబర్ 8 నుంచి నవంబర్ 30వ తేదీ నడుమ రూ. 2,700 కోట్ల నగదు విలువ చేసే బంగారు బిస్కెట్లను నగరంలో కొనుగోళ్లు చేసినట్టు ఈడీ తన దర్యాప్తులో కనుగొన్నదని ‘ఇండియా టుడే’ చానెల్ ఆదివారం ఓ కథనంలో పేర్కొంది.
అంతేకాకుండా హైదరాబాద్ నగరానికి రూ. 8వేల కోట్ల నగదు దిగుమతి జరిగిందని ఆ చానెల్ వెల్లడించింది. నోట్ల రద్దు తర్వాత భారీమొత్తంలో బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసిన సదరు వ్యక్తులు అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని పేర్కొంది. నగరంలో డిసెంబర్ 1 నుంచి 10వతేదీ మధ్యలో బంగారం మార్కెట్ (బులియన్) విపరీతంగా పుంజుకున్నదని, 1500 కిలోల బంగారం నగరానికి వచ్చిందని ఆ చానెల్ పేర్కొంది.
నగరానికి చెందిన ఓ బంగారు దుకాణంలో నవంబర్ 8-9తేదీ అర్ధరాత్రి వందకోట్లకుపైగా బంగారు అమ్మకాలు జరిగినట్టు ఈడీ గుర్తించిందని, అడ్వాన్స్‌డ్ చెల్లింపులు, ఆర్డర్ల పేరిట 5,200 మంది వినియోగదారులకు ముసద్దిలాల్ జెవెల్లర్స్ ఈ అమ్మకాలు చేసిందని ఈడీ వర్గాలను ఉటంకిస్తూ ఆ చానెల్ పేర్కొంది. ఎంఎంటీసీ, ఎండీ ఓవర్సీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు, యాక్సిస్, యెస్ బ్యాంకు, ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహింద్రా, ఇండస్ ఇండ్ వంటి బ్యాంకుల ద్వారా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌కు బంగారం దిగుమతి అయినట్టు ఈడీ గుర్తించిందని ’ఇండియా టుడే’ పేర్కొంది.