షాకింగ్: ఉబర్ డ్రైవర్ ఖాతాలో 7కోట్లు!
- హైదరాబాద్‌లో వెలుగుచూసిన వైనం
హైదరాబాద్: నగరానికి చెందిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 7 కోట్ల నగదు డిపాజిట్ అవ్వడం కలకలం రేపుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత భారీమొత్తంలో నగదు డిపాజిట్ అయిన ఖాతాలపై ఆదాయపన్ను (ఐటీ) అధికారులు నజర్ పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఐటీ దర్యాప్తు విభాగం అధికమొత్తంలో డిపాజిట్ అయిన ఖాతాలపై దృష్టిపెట్టగా.. ఉబర్ డ్రైవర్‌కు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ఖాతాలో రూ. 7 కోట్లు వెలుగుచూడటం వారిని బిత్తరపోయేలా చూసింది.
నవంబర్ రెండోవారంలో రద్దైన రూ. 500, వెయ్యి నోట్ల రూపంలో ఈ నగదు డిపాజిట్ అయింది. ఉబర్ డ్రైవర్ ఖాతా అంతకుముందు పెద్దగా క్రియాశీలంగా ఉండేది కాదని, కానీ నోట్ల రద్దు తర్వాత అతని ఖాతాలో డిపాజిట్ అయిన రూ. 7 కోట్లు దశలవారీగా ఒక బంగారు వర్తకుని ఖాతాకు బదిలీ అయిందని అధికారులు గుర్తించారు. దీనిపై సదరు డ్రైవర్‌ను ఐటీ అధికారులు విచారించగా.. నగదు ఎలా వచ్చింది, దానిని ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారనే దానిపై అతను సరైన కారణాలు తెలుపలేదని అధికారులు తెలిపారు. బ్యాంకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. డబ్బు డిపాజిట్ చేసే సమయంలో ఇద్దరు వ్యక్తులు అతనితోపాటు వచ్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. వారిని కూడా పట్టుకొని వివరాలు ఆరాతీశారు.
కాగా, పెద్దమొత్తంలో డిపాజిట్ అయిన ఈ డబ్బుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై)కింద పన్ను కట్టేందుకు క్యాబ్ డ్రైవర్ అంగీకరించాడని, మొత్తం ఏడు కోట్లలో పన్ను, పెనాల్టీ కింద రూ. 3.5 కోట్లు కట్టాల్సి ఉంటుందని, మరో 25శాతం పీఎంజీకేవై పథకంలో నాలుగేళ్లపాటు లాకిన్ డిపాజిట్‌గా ఉంచాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.