నల్లకుబేరుల అక్షయ తృతీయ | ​ demonetisation: black money holders gold rush | Sakshi
Sakshi News home page

నల్లకుబేరుల అక్షయ తృతీయ

Published Thu, Dec 8 2016 1:49 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

నల్లకుబేరుల అక్షయ తృతీయ - Sakshi

నల్లకుబేరుల అక్షయ తృతీయ

- 24 గంటలు.. 5 దుకాణాలు.. 470 కోట్లు
- 25కోట్ల చొప్పున బంగారం కొన్న ఓ మీడియా అధిపతి, ప్రముఖ హీరో సతీమణి
- 8వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 9వ తేదీ అర్ధరాత్రి దాకా వ్యాపారం
- ప్రతి ఐదు సెకన్లకో బిల్లు.. అన్నీ రూ. 1.90-1.99 లక్షల మధ్యే నమోదు
- బంగారం భారీగా కొన్నవారిలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అఖిల భారత సర్వీసు అధికారులు కూడా
- పెద్దనోట్ల రద్దు ప్రకటన వెంటనే బంగారం దుకాణాలకు పరుగులు

- రాష్ట్ర రాజధానిలో భారీ ఎత్తున కొనుగోళ్లు  క్రయ విక్రయాలపై దృష్టి సారించిన ఐటీ, సీబీఐ
- బంగారం షాపుల యజమానుల కాల్ డేటా, దుకాణాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన


సాక్షి, హైదరాబాద్:
నవంబర్ 8.. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయం.. ఆ తర్వాత కాసేపటికే హైదరాబాద్‌లోని నల్ల కుబేరులు ప్రముఖ నగల దుకాణాలకు క్యూ కట్టారు! దాచుకున్న నల్లధనంతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారు. దీంతో ఐదు ప్రముఖ దుకాణాల్లో 24 గంటల్లోనే ఏకంగా రూ.470 కోట్ల మేర బంగారం విక్రయాలు జరిగాయి. ఇలా బంగారం కొనుగోలు చేసిన వారిలో ఓ ప్రముఖ మీడియా అధిపతితో పాటు యువతలో మంచి క్రేజ్ ఉన్న ప్రముఖ హీరో సతీమణి, కొందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అఖిల భారత సర్వీసు అధికారులు కూడా ఉన్నారు. వీరిలో మీడియా అధిపతితో పాటు, ప్రముఖ హీరో సతీమణి చెరో రూ.25 కోట్లకు మించి బంగారం కొనుగోలు చేశారు. తమ దగ్గర కోట్లలో ఉన్న పెద్ద నోట్లు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన వీరంతా ప్రత్యామ్నాయంగా ఇలా బంగారం కొనుగోలును ఎంచుకున్నారు.

అప్పటికే తమకు పరిచయం ఉన్న నగల దుకాణాల యజమానులకు ఫోన్ చేసి తాము వస్తున్నామని కబురు చేయడంతో.. రాత్రి 10 గంటలకు మూతపడాల్సిన దుకాణాలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పనిచేశారుు. ప్రధాని ప్రకటన వెలువడిన తర్వాత 24 గంటల పాటు ఈ నగల దుకాణాల యజమానుల కాల్ డేటాను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వచ్చింది, ఆ కాల్ చేసిన వారి వివరాలన్నీటిని సేకరించారు. అయితే ఆ వివరాలను గోప్యంగా ఉంచారు. నగల దుకాణాల సీసీ కెమెరా ఫుటేజీలను కూడా స్వాధీనం చేసుకుని ఆ దృశ్యాలను వీడియోలో నిక్షిప్తం చేశారు.

చేతికి అందిన దేన్నీ వదిలిపెట్టలేదు
నల్లకుబేరులు నగల దుకాణాల్లో ఉన్న బంగారం బిస్కట్లే కాదు చేతికి దొరికిన ఏ ఒక్క ఆభరణాన్ని వదిలి పెట్టలేదు. పంజాగుట్టలోని ఓ దుకాణంలో నవంబర్ 8వ తేదీ రాత్రి 10-12 గంటల మధ్య రూ.47 కోట్ల విలువైన బంగారం అమ్ముడుపోయింది. ఉన్న స్టాక్ అయిపోవడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ దుకాణాల నుంచి అగమేఘాలపై నగలు తెప్పించి కోటీశ్వరుల కోసం అందుబాటులో ఉంచారు. ఆ ఒక్క దుకాణం యజమాని రెండ్రోజుల్లో నగలు అమ్మి బ్యాంక్‌ల్లో జమ చేసిన పెద్ద నోట్ల మొత్తం రూ.170 కోట్లు. బంజారాహిల్స్, పంజగుట్టలోని మరో నాలుగు దుకాణాల్లోనూ 24 గంటల్లో రూ.300 కోట్ల విలువైన బంగారం అమ్ముడుపోయింది. ప్రధాని పెద్దనోట్లు రద్దు చేసిన మూడో రోజు సాయంత్రానికి ఈ ఐదు దుకాణాలు బ్యాంక్‌ల్లో జమ చేసిన మొత్తం ఏకంగా రూ.470 కోట్లు!

సీబీఐ చేతికి వివరాలు
హైదరాబాద్‌లో నవంబర్ 10, 11 తేదీల్లో మొత్తం నగల దుకాణాల నుంచి డిపాజిట్ అయిన పెద్ద నోట్ల వివరాలను ఆదాయ పన్ను శాఖ బ్యాంకుల నుంచి సేకరించి సీబీఐకి అప్పగించింది. వీటితోపాటు ఐటీ దాడుల సందర్భంగా వెలుగు చూసిన అనేక అంశాలతో సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో రాజధానిలో మొత్తం బంగారు నగల దుకాణాల్లో నవంబర్ 8-15 తేదీల మధ్య జరిగిన లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు.

ఐదు సెకన్లకు ఓ బిల్లు
బంగారం కొనుగోళ్లకు సంబంధించి వ్యాపారులు తెలివిగా చిన్న మొత్తాల్లో బిల్లులు రాశారు. రూ.2 లక్షల పైబడి కొనుగోలు చేసిన మొత్తానికి పాన్ నెంబర్ నమోదు చేయాల్సి ఉన్నందున మొత్తం బిల్లులను ఏదో ఒక పేరుతో రూ.1.90 లక్షల నుంచి 1.99 లక్షల దాకా రాసేశారు. పంజగుట్ట నగల దుకాణంలో 9వ తేదీ రాత్రి 10-11 గంటల నుంచి 12-37 గంటల వరకూ ప్రతి ఐదు సెకన్లకు ఓ బిల్లును జనరేట్ చేశారు. మామూలుగా బంగారం కొనుగోలు చేస్తే నగల వివరాలు, అందులో నిక్షిప్తమై ఉన్న ఇతర వజ్రాలు, కెంపులు, రత్నాలు వంటి వాటి వివరాలు కూడా ఉండాలి. కానీ ఈ బిల్లులపై మొత్తం క్వాంటిటీ, మొత్తం విలువ మాత్రమే నమోదు చేశారు. ఆ 24 గంటల్లో ఈ ఐదు దుకాణాల్లో బిల్లులన్నీ ఇదే తరహాలో ఉన్నాయి.

వారెవరో మాకు తెలియదు
ప్రతి బిల్లు రూ.2 లక్షలకు తక్కువగా ఎందుకు ఉందని ఐటీ అధికారులు ఓ నగల దుకాణం యజమానులను ప్రశ్నిస్తే పన్ను బారి నుంచి తప్పించుకోవడానికి వినియోగదారులు అలా చేసి ఉండొచ్చని సమాధానమిచ్చారు. అయితే వినియోగదారులెవరో తమకు తెలియదని, వివాహ శుభ కార్యాలున్నాయని చెప్పడంతో మామూలుగా కంటే 2 గంటలు అదనంగా దుకాణాలు పని చేశాయన్నారు. సీసీటీవీ ఫుటేజీలో తెలిసిన వ్యక్తులను చూపి వీరు కూడా తెలియదా అని రెట్టించి అడిగితే వారు దుకాణానికి వచ్చారు కానీ బంగారం కొనుగోలు చేయలేదని దబాయించారు.

లాభం లేదని, కేసును సీబీఐకి అప్పగిస్తామని బెదిరించడంతో కొందరి పేర్లు బయటపెట్టినట్లు సమాచారం. అయితే వారెంత మొత్తంలో బంగారం కొనుగోలు చేశారన్న వివరాలు తమ వద్ద లేదని చెప్పడం కొసమెరుపు. ‘‘కోట్లలో ఉన్న పెద్ద నోట్లతో బంగారం కొన్నవారి వివరాలు తెలుసుకుంటున్నాం. వారికి నోటీసులు ఇవ్వడానికి ముందే మేం వ్యూహాత్మక అడుగులు వేస్తాం. ఆ తర్వాతే వారిని ఎలా దారికి తీసుకురావాలో ఆలోచిస్తాం’’అని ఐటీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement