
బాలలకు కూడా జీమెయిల్,యూట్యూబ్ సేవలు!
లండన్: 13 ఏళ్లలోపు వారికి కూడా తొలిసారిగా చట్టపరంగా జీమెయిల్, యూట్యూబ్ తదితర సేవలను ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సేవలను చిన్నారులు వినియోగించుకోవడంపై తల్లిదండ్రుల నియంత్రణ ఉండేలా గూగుల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ద టైమ్స్’ కథనం ప్రచురించింది.
ప్రస్తుతం 13 ఏళ్ల లోపువారికి గూగుల్, ఫేస్బుక్ సేవలు అందుబాటులో లేవు.
ప్రత్యేక డాష్‌బోర్డు ద్వారా కొన్ని రకాల సేవలను తల్లిదండ్రులు నియంత్రించే వెసులుబాటును గూగుల్ కల్పించనుందని పత్రిక తెలిపింది. అయితే ఈ కథనంపై స్పందించేందుకు గూగుల్ నిరాకరించింది. 13 ఏళ్లలోపు వారికి చట్టపరంగా గూగుల్, ఫేస్‌బుక్ సేవలను వినియోగించుకునేందుకు అవకాశం లేకపోయినా చాలా మంది వయోజనులుగా పేర్కొంటూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.