ఉద్యోగానికి ఉత్తమ కంపెనీ.. గూగుల్ | Google world's best place to work for: Survey | Sakshi
Sakshi News home page

ఉద్యోగానికి ఉత్తమ కంపెనీ.. గూగుల్

Published Thu, Oct 24 2013 12:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

ఉద్యోగానికి ఉత్తమ కంపెనీ.. గూగుల్

ఉద్యోగానికి ఉత్తమ కంపెనీ.. గూగుల్

న్యూయార్క్: ఉద్యోగం చేయడానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బహుళజాతి కంపెనీగా ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ అగ్రస్థానం దక్కించుకుంది. సాఫ్ట్‌వేర్ డెవలపింగ్ సంస్థ ఎస్‌ఏఎస్ ఇనిస్టిట్యూట్, నెట్‌వర్క్ స్టోరేజ్ సంస్థ నెట్‌యాప్ వరుసగా తర్వాత స్థానాల్లో నిల్చాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మానవ వనరుల ‘కన్సల్టెన్సీ గ్రేట్ ప్రేస్ టు వర్క్ ఇనిస్టిట్యూట్’ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మొత్తం 25 కంపెనీలతో ఈ జాబితా రూపొందించగా.. ఇందులోనివన్నీ అమెరికా లేదా యూరప్‌కి చెందినవే తప్ప భారత్‌కి చెందిన ఒక్క కంపెనీకి కూడా చోటు దక్కలేదు.
 
 కనీసం అయిదు బెస్ట్ వర్క్‌ప్లేసెస్ జాబితాల్లో చోటు దక్కించుకున్న సుమారు 1,000  కంపెనీలను సర్వే చేసిన మీదట ఈ 25 సంస్థలను ఎంపిక చేశారు. కనీసం 5,000 మంది ఉద్యోగులు ఉండటంతోపాటు సుమారు 40 శాతం మంది విదేశాల్లో పనిచేస్తున్న కంపెనీలను ఇందుకు పరిగణనలోకి తీసుకున్నారు.
 టాప్ 10లో డబ్ల్యూఎల్ గోర్ అండ్ అసోసియేట్స్(5), కింబర్లీ క్లార్క్(6), ఆతిథ్యరంగ సంస్థ మారియట్(7), కన్సూమర్ గూడ్స్ కంపెనీ డయాజియో(8), నేషనల్ ఇన్ స్ట్రుమెంట్స్(9), ఐటీ దిగ్గజం సిస్కో(10) ఉన్నాయి. టాప్ 10లో ఒక్క డియాజియో మాత్రమే అమెరికాయేతర కంపెనీ కావడం గమనార్హం. జాబితాలోని మొత్తం 25 కంపెనీల్లో 1.19 కోట్లమందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement