న్యూఢిల్లీ: దేశమాత దాస్యశృంఖలాలను బద్ధలు కొట్టడానికి అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, చిరునవ్వుతో ఉరికొయ్యకు వేలాడిన స్వాతంత్య్ర యువకిశోరం భగత్‌సింగ్ బలిదానానికి ఘోర అపచారం! ఆ ధీరుడి అమరత్వానికి చరిత్రపుటల్లో శాశ్వత స్థానం దక్కినా అధికార పత్రాల్లో మాత్రం చోటు దక్కలేదు..! ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఆ అపురూపమైన ఆత్మత్యాగం ప్రభుత్వ రికార్డుల్లో కాసింత చోటుకు నోచుకోలేదు. భగత్‌సింగ్‌ను అమరవీరుడిగా ప్రకటించారో లేదో చెప్పే రికార్డులేవీ తమ వద్ద లేవని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేతులెత్తేసింది.
భగత్‌ను, ఆయన సహచరులైన రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఎప్పుడు అమరులుగా ప్రకటించారో వెల్లడించాలని భగత్ సమీప బంధువు యాదవేంద్ర సింగ్ ఏప్రిల్‌లో హోం శాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులో కోరారు. ఆ ముగ్గురిని అమరులుగా ప్రకటించకపోయినట్లయితే, ఎందుకు ప్రకటించలేదో బయటపెట్టాలని, ఆ గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని అడిగారు. దీనికి హోం శాఖ ప్రజా సంబంధాల అధికారి శ్యామలాల్ మోహన్ మే నెలలో దిగ్భ్రాంతికరమైన సమాధానమిచ్చారు
. ‘భగత్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను అమరవీరులుగా ప్రకటించినట్లు చెప్పే రికార్డులేవీ మా శాఖ వద్ద లేవు. వారికి ఆ గౌరవం కల్పించే విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందో కూడా తెలియదు’ అని సెలవిచ్చారు. దీంతో యాదవేంద్ర తదుపరి కార్యాచరణ కోసం హోం శాఖ కార్యదర్శిని సంప్రదించేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘భగత్‌కు అమరుడి గౌరవం కల్పించే విషయంలో రాష్ట్రపతి కూడా సానుకూలంగా స్పందించకపోతే దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తా’ అని యాదవేంద్ర చెప్పారు. స్వాతంత్రోద్యమంలో అసువులు బాసిన వారిని అమరులుగా ప్రకటించే విధానమేదీ లేదని హోం శాఖ వర్గాలు చెప్పాయి. రక్షణ శాఖ సైనికులకు మాత్రమే ఆ హోదా ఇస్తుందన్నాయి.
వివాదం వద్దు... ప్రధాని: భగత్ అమరత్వానికి రికార్డులు ఆధారం కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఈ అంశంపై వివాదాన్ని రేపకూడదని కోరారు. ‘భగత్ స్వాతంత్య్రమనే మహత్తర లక్ష్యం కోసం అమరుడయ్యారు. ఆయన అమరత్వానికి అధికార రికార్డులు ఆధారం కాదు. భగత్ జాతికి గర్వకారణం. ఆయనకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది.’ అని ఓ ప్రకటనలో తెలిపారు.