భగత్‌సింగ్ బాంబులు చేసిన గది ఎక్కడుంది?
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో.. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా 1928లో శాంతియుతంగా ఉద్యమిస్తున్న లాలా లజపతి రాయ్.. బ్రిటిష్ పోలీసుల దాడిలో మరణించారు. ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు. ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్ఏ) అనే విప్లవ సంస్థ నాయకుడు. విప్లవ కార్యకలాపాలకు అవసరమైన బాంబులు, ఆయుధాలు తయారు చేయడానికి లాహోర్‌లో, సహరాన్‌పూర్‌లో రెండు బాంబు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. లాహోర్‌లోని ఆ స్థావరం 69వ నంబర్ గది. దానిని యువ విప్లవకారులు సురక్షితమైన రహస్య స్థావరంగా ఉపయోగించుకునేవారు.
లాలా మృతికి కారణమైన జేమ్స్ స్కాట్‌ను హతమార్చాలని ప్రణాళిక పన్నిన ఆ విప్లవకారుడు 1928 డిసెంబర్‌లో లాహోర్ పోలీస్ సూపరింటెండెంట్ జాన్ సాండర్స్ ను కాల్చడంతో అతడు చనిపోయాడు. అనంతరం ఆ విప్లవకారుడు అతడి సహచరులు లాహోర్లోని 69వ నంబర్ గదిలో కలుసుకుని లాహోర్ నుంచి తప్పించుకుని కలకత్తా వెళ్లిపోయారు. భగత్‌సింగ్‌ను, ఆయన సహచరులను పట్టుకోవడానికి బ్రిటిష్ పాలకులు ఎంతగా ప్రయత్నించినా పట్టుకోలేకపోయారు. ఢిల్లీ అసెంబ్లీలో బాంబు పేల్చి స్వయంగా పోలీసులకు అరెస్టయితే కానీ వారి ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఆ యువకుడు భగత్‌సింగ్. అనంతరం జరిగిన కథ అందరికీ తెలిసిందే. కానీ.. లాహోర్‌లో భగత్‌సింగ్ ఉపయోగించిన 69వ నంబర్ గది ఇప్పుడు ఎక్కడ ఉంది? భగత్‌సింగ్ పట్టుబడ్డ తర్వాత ఏమైంది? ఆ గదిని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ క్రియాశీల కార్యకర్త దుర్గాదేవి పేరు మీద అద్దెకు తీసుకున్నారు.
ఆమె తన భర్త భగవతి చరణ్ వోహ్రా, కుమారుడు సచీంద్ర వోహ్రాతో కలిసి అక్కడ నివసించేవారు. భగవతి చరణ్ వోహ్రా కూడా విప్లవ సంస్థ నాయకుడే. భగత్‌సింగ్‌తో కలిసి వారిద్దరూ కూడా కలకత్తా వచ్చారు. కొంత కాలం తర్వాత దుర్గాదేవి లాహోర్లోని 69వ నంబర్ గదికి తిరిగివెళ్లారు. ఆమె భర్త వోహ్రా కూడా కలకత్తాలో ఉన్నపుడు బాంబు తయారు చేసే మెళకువలు నేర్చుకుని వచ్చారు. ఆ గదిలో యువ విప్లవకారుల విప్లవ కార్యక్రమాలు కొనసాగాయి. బాంబుల తయారీ కొనసాగింది. ప్రఖ్యాత సంగీతకారుడు ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ కూడా ఈ బృందంలో సభ్యుడు. ఆయన తన కాలేజీ లాబొరేటరీ నుంచి రసాయనాలు తస్కరించి తెస్తే.. వాటిని బాంబుల తయారీకి ఉపయోగించేవారు. కానీ కొంత కాలానికి లాహోర్‌లోని బాంబు తయారీ కేంద్రాన్ని కూడా బ్రిటిష్ పాలకులు కనుగొన్నారు.
సుఖ్‌దేవ్ సహా అతడి అనుచరులు చాలా మందిని అరెస్ట్ చేశారు. అయితే.. భగవతి చరణ్ వోహ్రా బాంబులు తయారు చేయడం కొనసాగించాడు. 1929 డిసెంబర్ 23న ఢిల్లీ – ఆగ్రా రైల్వే లైన్‌లో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రయాణిస్తున్న రైలు లక్ష్యంగా బాంబు పేల్చాడు. అయితే లార్డ్ ఇర్విన్‌తో పాటు అదే రైలులో ప్రయాణిస్తున్న మహాత్మా గాంధీ కూడా ఆ పేలుడు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం 1930 మే 28వ తేదీన రావీ నది ఒడ్డున అటవీ ప్రాంతంలో భగత్‌సింగ్ ఆయన సహచరులను పోలీసుల చెర నుంచి తప్పించేందుకు బాంబు దాడి చేయాలని వోహ్రా ప్రణాళిక రచించారు. కానీ ఆ క్రమంలో బాంబు ప్రమాదవశాత్తూ ముందే పేలడంతో ఆయన తీవ్రంగా గాయపడి చనిపోయారు.
ఇక ఆ 69వ నంబర్ గది! అది లాహోర్ లోని మెక్లియాడ్ రోడ్‌లో గల కశ్మీర్ బిల్డింగ్ ఆవరణలో ఉండేది. దేశ విభజన అనంతరం లాహోర్ సహా పాకిస్తాన్ వేరే దేశమైంది. కశ్మీర్ బిల్డింగ్‌ని 1952లో ఒక హోటల్‌గా మార్చారు. 1988లో ఆ బిల్డింగ్‌ని కూల్చేసి ఆ ప్రదేశంలో షాపింగ్ ప్లాజా, హోటల్ కట్టారు. ఇది ప్రముఖ లక్ష్మీ చౌక్ సమీపంలో ఉంది. ఈ హోటల్ పేరు ఇప్పుడు చాలా ప్రఖ్యాతి గాంచింది.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్