అసెంబ్లీ సమావేశాలను పొడిగించం
- 4వ తేదీ వరకే నిర్వహిస్తాం
- అవసరమైతే ఒకరోజు సాయంత్రం భేటీ
- బీఏసీ సమావేశంలో స్పష్టం చేసిన ప్రభుత్వం
- 15 రోజులు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ వినతి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలను పొడిగించేందుకు ప్రభుత్వం ససేమిరా అంది. సెప్టెంబర్ 4వ తేదీ వరకే సమావేశాలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అవసరమైతే ఒకరోజు సాయంత్రం పూట నిర్వహిస్తామని తెలిపింది. శాసనసభ వ్యవహారాల సలహా మండలి(బీఏసీ) సమావేశం సోమవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ తరపున శాసనసభా పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ, సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బీజేఎల్పీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ కోరింది. 24 అంశాలను సభలో చర్చించాలని ప్రతిపాదించింది. దీన్నిప్రభుత్వం అంగీకరించలేదు. బిల్లులను ఆమోదించుకొనేందుకు సభను ఒకరోజు సాయంత్రం పూట సమావేశపరుస్తారు. బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కాకపోవటాన్ని చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు ప్రస్తావించారు. జ్యోతుల, గడికోట స్పందిస్తూ.. మేం సరిపోమా అన్నారు. ఇదే సమయంలో మంత్రి యనమల జోక్యం చేసుకుని కాలువ తీరుపట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రతి ఒక్కరూ సమావేశానికి హాజరయ్యేలా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మీదే అని అన్నట్లు సమాచారం.
కరువుపై మండలిలో నేడు చర్చ
రాష్ర్టంలో నెలకొన్న కరువు పరిస్థితులపై మంగళవారం శాసనమండలిలో చర్చించనున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన మం డలి సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మండలి సలహా కమిటీ సమావేశం ఛైర్మన్ చక్రపాణి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదాపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై మండలిలో చర్చకు ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. యనమల స్పందిస్తూ.. ఇదే అంశంపై శాసనసభలో ప్రభుత్వం ప్రకటన చేస్తోందని, అక్కడ చర్చించిన తరువాత మండలిలో చర్చిద్దామని చెప్పారు.
చంద్రబాబు.. అంత టైమ్ లేదన్నారు
ప్రజా సమస్యలపై చర్చించడానికి శాసనసభ సమావేశాలను పొడిగించాలని తాము కోరగా.. అంత టైమ్ లేదని సీఎం చంద్రబాబు అన్నారని వైఎస్సార్‌సీపీ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రు చెప్పారు. బీఏసీ అనంతరం ఆయన ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డిలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. సభను 15 రోజులపాటు జరపాలని సీఎంని ప్రత్యేకంగా అభ్యర్థించానన్నారు.పాలనాపరమైన విధుల్లో తలమునకలై ఉన్నామని, అన్ని రోజులు సభ జరపడం సాధ్యం కాదంటూ తమ అభ్యర్థనను సీఎం తోసిపుచ్చారని పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించినవి
విభజన చట్టంలోని హామీలు-ప్రత్యేక హోదా, గోదావరి పుష్కరాల్లో భక్తుల మరణాలు, ఓటుకు కోట్లు కేసు, రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ, బినామీ కంపెనీలకు సంతర్పణలు, రైతుల ఆత్మహత్యలు, ఇసుక మాఫియా, రిషితేశ్వరి మృతి, కళాశాలల్లో ఆత్మహత్యలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, పోలవరం-పట్టిసీమ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, నీరు-చెట్టు, ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, విషజ్వరాలు-మరణాలు, బొగ్గు కుంభకోణం, జీవో నంబర్ 22, రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, బెరైటీస్ టెండర్ల మార్పు, గృహ నిర్మాణం, టీడీపీ వాగ్దానాలు.
టీడీపీ ప్రతిపాదించినవి
ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, గోదావరి మహా పుష్కరాలు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, ఎర్రచందనం అక్రమ రవాణా, విశ్వవిద్యాలయాల పరిపాలన, రైతుల రుణ మాఫీ, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, బీసీ సబ్‌ప్లాన్, జాతీయ విద్యా సంస్థలు, మీ ఇంటికి మీ భూమి. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు , ఫించన్లు, సంక్షేమ కార్యక్రమాలు.
బీజేపీ ప్రతిపాదించిన అంశాలు పెరిగిన ఇసుక ధరలు, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా.