![ఒక్కో నోటు ప్రింటింగ్ ఖర్చు ఎంతో తెలుసా?](/styles/webp/s3/article_images/2017/09/5/51489636883_625x300.jpg.webp?itok=EEu3Zv_s)
ఒక్కో నోటు ప్రింటింగ్ ఖర్చు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: కొత్తగా చెలామణిలోకి తెచ్చిన కరెన్సీ నోట్ల ముద్రకు ఎంత ఖర్చవుతుందో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పాత రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రెండు వేల రూపాయల నోట్లను అందుబాటులోకి తెచ్చింది. ఒక కూ. 500 నోటు ముద్రించడానికి రూ.2.87 నుంచి రూ. 3.09 ఖర్చవుతోందని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు. రెండు వేల రూపాయల నోటు ముద్రించేందుకు ఒక్కోదానికి రూ.3.54 నుంచి రూ. 3.77 వ్యయమవుతోందని తెలిపారు.
ఒక్కో కొత్త నోటు ముద్రణకు ఎంత ఖర్చవుతుందని అడిగిన ప్రశ్నకు ఆయన ఈవిధంగా బదులిచ్చారు. అయితే కొత్త రూ. 500, రెండు వేల రూపాయల నోట్ల ముద్రణకు మొత్తం ఎంత ఖర్చు అయిందో తెలిపేందుకు ఆయన నిరాకరించారు. ఇంకా రూ. 500, రెండు వేల రూపాయల నోట్ల ముద్రణ కొనసాగుతుందని, మొత్తం ఖర్చు వ్యయం గురించి ఇప్పుడు తెలపడం సముచితం కాదని అన్నారు. కొత్త నోట్ల ముద్రణ నిర్విరామంగా కొనసాగుతోందన్నారు.