
రెండోరోజూ అమెరికాను వీడని గ్రహణం!!
ఒకవైపు డెమొక్రాట్లు.. మరోవైపు రిపబ్లికన్లు.. ఎవరికి వారే పట్టుదలకుపోవడంతో అమెరికాలో రెండోరోజు కూడా పరిస్థితి అధ్వానంగానే ఉంది. ప్రతిపక్షాలు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. పది లక్షల మందికి పైగా ప్రజలకు ఉద్యోగాలు లేకుండా చేశారంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. 'ఒబామా కేర్' పథకం విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో బడ్జెట్ మీద ఒక ఒప్పందానికి రావడంలో ఇరు పార్టీలు విఫలమయ్యాయి.
ప్రతిపక్షాలు కేవలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇలా చేస్తున్నాయని ఒబామా విమర్శించారు. ప్రభుత్వం బందయ్యే పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగితే ప్రభావం అంత దారుణంగా ఉంటుందని, అనేక కుటుంబాలు వీధిన పడతాయని, అనేక వ్యాపారాలు దెబ్బ తింటాయని అన్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చిన ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు బడ్జెట్ను ఆమోదించాలని ఆయన కాంగ్రెస్కు విజ్ఞప్తి చేశారు.
అమెరికాకు ఇన్నాళ్లూ ఉన్న మంచిపేరును మట్టిలో కలిపేయొద్దని.. అందుకు తాను ఎవరినీ ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. కేవలం ఒక్క చట్టం కోసం లక్షలాది మంది కార్మికుల పొట్టగొట్టడం సరికాదని చెప్పారు. పార్కులు, మ్యూజియంలు, ప్రభుత్వ కార్యాలయాలు.. అన్నీ మూత పడటంతో దాదాపు 8 లక్షల మందికి పైగా ఫెడరల్ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒబామా ఎంత చెప్పినా రిపబ్లికన్లు మాత్రం తమ విధానాన్ని మార్చుకోడానికి ససేమిరా అంటున్నారు. వాళ్లు అదేమాటకు కట్టుబడితే బడ్జెట్ ఆమోదం పొందే ప్రసక్తే ఉండబోదు.