
కేంద్ర మంత్రులతో భేటీ అయిన వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్
* సీసీఐకి కేంద్ర మంత్రి రాధా మోహన్‌సింగ్ ఆదేశం
* మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని సూచన
సాక్షి,న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా ల్లో ఇప్పటివరకు జరిగిన పత్తి కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను అందచేయాలని కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్ సింగ్ సీసీఐ అధికారులను ఆదేశించారు. ఈ రాష్ట్రాల్లో పత్తికి కనీస మద్దతు ధర లభించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని పత్తి రైతుల ఆత్మహత్యలు, సాగునీటి సమస్యలు, విద్యుత్‌కష్టాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యవసాయ మంత్రి రాధామోహన్ దృష్టికి బుధవారం ఉదయం తీసుకెళ్లారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయనకు చెప్పారు.
దీంతో రాధామోహన్‌సింగ్ వెంటనే ఢిల్లీలోని కృషిభవన్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ, ఏపీలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లోని పత్తి రైతు సమస్యలపై మంత్రులు, సీసీఐ, నాఫెడ్ అధికారులతో సమీక్షించారు. తెలంగాణలో పత్తికి మద్దతు ధర కల్పించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని, అదనంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని దత్తాత్రేయ ఈ సందర్భంగా కోరారు.
దీనిపై స్పందించిన రాధామోహన్‌సింగ్ ఏపీ, తెలంగాణలో కనీస మద్దతు ధరకన్నా తక్కువకు పత్తి విక్రయాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగిన పత్తి కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను అందచేయాలని సీసీఐని ఆదేశించారు.పత్తి కొనుగోళ్లపై సమయానుసారంగా విలేకరుల సమావేశాలు నిర్వహించి వివరాలను అందచేయాలని, తద్వారా సీసీఐ కేంద్రాలున్నాయనే సందేశం రైతులకు వెళుతుందని పేర్కొన్నారు. దళారులకు చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని ఆకస్మిక తనిఖీలు జరిపించాలని సూచించారు.
కాగా.. పత్తి రైతులకు మార్కెట్‌లో మంచి ధర లభించకుంటే సీసీఐ కొనుగోలు చేస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వ్యాఖ్యానించారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు అవసరముంటే తెలియపర్చాలని సీఎం, ఎంపీలకు లేఖలు రాశామన్నారు. వారం తరువాత పూర్తి పరిస్థితులపై మరోసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో చేనేతకారుల సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను దత్తాత్రేయ కోరారు. దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీజేపీ బృందం బుధవారం సంతోష్ గంగ్వార్, నిర్మలా సీతారామన్‌లకు వేర్వేరుగా వినతిపత్రాలు అందచేసింది.