
పాలస్తీనాపై విధానంలో మార్పులేదు:సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ:పాలస్తీనా అంశంపై ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని, గాజా ప్రాంతంలో సంఘర్షణపై ఎవరి పక్షమూ వహించబోమని ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో స్పష్టంచేసింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజాలో పరిస్థితిపై తీర్మానం చేయాలన్న ప్రతిపక్షం డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. గాజా పరిస్థితిపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ సమాధామిస్తూ, గాజా సమస్యపై సభలో రెండురకాల అభిప్రాయాలు ఉండరాదని, హింసాకాండ ఎక్కడ తలెత్తినా ఖండిస్తున్నామనే ఉమ్మడి సందేశాన్ని పంపించాలని సూచించారు. శాంతిచర్చలపై ఈజిప్ట్ చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్, పాలస్తీనా ఆమోదించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
అంతకు ముందు సభలో చర్చ సందర్భంగా,. గాజాలో హింసాకాండను ప్రతిపక్ష సభ్యులు ఖండించారు. గాజాపై తీర్మానాన్ని ఆమోదించాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌నుంచి సైనిక కొనుగోళ్లను ప్రభుత్వం రద్దుచేసుకోవాలని, గాజా సమస్యను ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించాలని కూడా డిమాండ్ చేశారు.