ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ నిర్భయ్ శర్మ గురువారం రాత్రి రద్దు చేశారు. వచ్చేనెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలతోపాటే అరుణాచల్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఆ రాష్ట్ర కేబినెట్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం నబం టుకీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసింది. దీంతో గవర్నర్.. అరుణాచల్ అసెంబ్లీని రద్దు చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమేశ్ నెగీ తెలిపారు. లోక్‌సభతోపాటే అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల వ్యయం తగ్గుతుందని కేబినెట్ అభిప్రాయపడినట్టు చెప్పారు. అరుణాచల్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి.