
సీఎంల గైర్హాజరుపై స్పందించిన గవర్నర్
హైదరాబాద్: రాజ్భవన్లో తేనేటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గైర్హాజరవడంపై గవర్నర్ నరసింహన్ సరదాగా స్పందించారు. ఇద్దరు సీఎంలు రాకపోవడమన్నది సత్యమని, అయితే ఎందుకు రాలేదన్న విషయంపై ఓ నిర్ణయానికి రావద్దని నరసింహన్ అన్నారు.
రెండు రాష్ట్రాలకు, ఇద్దరు సీఎంలకు తాను ఆమోదయోగ్యమైనవాడినని గవర్నర్ చెప్పారు. హైదరాబాద్లో ఉన్నంత వరకు అందరూ తనను ఆమోదిస్తారని వ్యాఖ్యానించారు. విందుకు ముఖ్యమంత్రులు రాలేదని అడుగుతున్నారు కానీ, తాను, మీరు ఉన్నది సరిపోదా అని మీడియాను ఉద్దేశించి గవర్నర్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ తేనేటి విందును ఏర్పాటు చేశారు. ఈ తేనేటి విందుకు చంద్రబాబు, కేసీఆర్ హాజరుకాలేదు. వివిధ పార్టీల నేతలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విందుకు హాజరయ్యారు.