నేడు మోదీ విదేశీయానం | Govt clears $3bn helicopters deal ahead of Modi's US visit | Sakshi
Sakshi News home page

నేడు మోదీ విదేశీయానం

Published Wed, Sep 23 2015 1:20 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

నేడు మోదీ విదేశీయానం - Sakshi

నేడు మోదీ విదేశీయానం

తొలుత ఐర్లాండ్‌లో.. తర్వాత అమెరికాలో.. ఐరాస సదస్సులో పాల్గొననున్న ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐర్లాండ్, అమెరికా దేశాల పర్యటన నిమిత్తం బుధవారం ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఏడు రోజుల పర్యటనలో ముందుగా బుధవారం నాడు ఐర్లాండ్ వెళ్లనున్న మోదీ.. దాదాపు ఆరు దశాబ్దాల్లో ఆ దేశంలో పర్యటించే తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. డబ్లిన్‌లో ఆ దేశ ప్రభుత్వాధినేత (తాషెక్) ఎన్డా కెన్నీతో చర్చలు జరుపుతారు.

రానున్న సంవత్సరాల్లో ఐర్లాండ్‌తో ప్రజా, ఆర్థిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు ఈ పర్యటన దోహదపడుతుం దని తాను విశ్వసిస్తున్నట్లు మోదీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం అక్కడి నుంచి న్యూయార్క్ బయల్దేరి వెళ్లేముందు.. ఐర్లండ్‌లోని భారత సంతతి ప్రజలతో మోదీ కొద్దిసేపు సమావేశమవుతారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో సుస్థిర అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యమిస్తున్న శాంతిపరిరక్షణపై ఐరాస సదస్సులో పాల్గొంటారు.

పలు ప్రపంచ దేశాల నేతలను, ప్రతిష్టాత్మక పెట్టుబడిదారులు, ఆర్థిక రంగ సంస్థల అధిపతులనూ మోదీ కలవనున్నారు. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలపై చర్చల కోసం ఫార్చ్యూన్-500 సంస్థలతో వర్కింగ్ డిన్నర్ జరుగుతుంది. ఆ తర్వాత వెస్ట్‌కోస్ట్‌లో ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయాన్ని, గూగుల్ క్యాంపస్‌ను, టెస్లా మో టార్స్ సంస్థను సందర్శిస్తారు.

ఈ నెల 27వ తేదీన శాన్ జోస్‌లో భారత సంతతి ప్రజలతో మోదీ ముచ్చటిస్తారు. అమెరికాలో తన గత పర్యటన, ఈ ఏడాది ఆరంభంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనను మోదీ ఉటంకిస్తూ.. తాజా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
ఒకే హోటల్‌లో మోదీ, షరీఫ్ విడిది
న్యూయార్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒకే హోటల్‌లో విడిది చేయనున్నారు. ప్రఖ్యాత ఆస్టోరియా హోటల్ ఇందుకు వేదిక కానుంది. ఈ వారంలో జరగనున్న 70వ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరు దేశాల ప్రధానులూ అక్కడకు చేరుకోనున్నారు. నేటి సాయంత్రం మోదీ ఆస్టోరియాకు చేరుకోనున్నారు. 25న సాయంత్రానికి షరీఫ్ అక్కడకు వెళ్తారు. వీరి మధ్య ద్వైపాక్షిక భేటీ విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే వీరిరువురూ ఒకే హోటల్‌లో బస చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement