పర్యటన 95 గంటలు విమానంలో 33 గంటలు
భారత్ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను ముగించుకుని ప్రధాని మోదీ బుధవారం భారత్‌కు తిరిగివచ్చారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. నాలుగు రోజుల పర్యటనలో మోదీ పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోలేదు. మరుసటి రోజు ఏదైనా కార్యక్రమం ఉంటే తప్ప ఆయన బస చేయలేదు. పోర్చుగల్, నెదర్లాండ్స్‌లలో ఒక్కోరోజులోనే పర్యటన పూర్తి చేసిన మోదీ అమెరికాలో మాత్రం రెండ్రోజులు పర్యటించారు.
మొత్తం 95గంటలపాటు సాగిన ఆయన టూర్‌లో 33గంటలు ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో ప్రయాణించారు. పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్‌లో కలిపి వరుసగా 33 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూన్ 24న ఉదయం 7గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి లిస్బన్‌కు పదిగంటల్లో వెళ్లిన మోదీ అక్కడ కనీసం హోటల్ కూడా తీసుకోకుండా ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోనే విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత పోర్చుగల్ విదేశాంగ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి భారతీయులతోమాట్లాడాక, లిస్బన్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.
8 గంటలు ప్రయాణించి వాషింగ్టన్ చేరుకున్నారు. మోదీ రెండ్రోజుల్లో అమెరికాలో 17 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం రాత్రి 9గంటలకు అమెరికా పర్యటన పూర్తికావడంతో రాత్రి అక్కడే బసచేయకుండా వెంటనే నెదర్లాండ్స్‌కు వెళ్లారు. నెదర్లాండ్స్‌లో 7 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత పర్యటన ముగించుకుని వెంటనే రాత్రి బయల్దేరి బుధవారం ఉదయం ఆరుకల్లా ఢిల్లీ చేరుకున్నారు.