సినీ కార్మికులపై మంత్రుల వరాల జల్లు
హైదరాబాద్: సినీ కార్మికులపై రాష్ట్ర మంత్రులు వరాల జల్లు కురిపించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వారడిగిన కోరికలన్నింటినీ అక్కడికక్కడే ఓకే చెప్పి వారిని సంతృప్తి పరిచారు. రాజేంద్రనగర్ మండలం మణికొండ పంచాయతీ పరిధిలోని చిత్రపురికాలనీలో మంత్రులు కె.తారకరామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు వారి దృష్టికి తెచ్చిన కాలనీ ప్రధానరోడ్డు నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. కోటిన్నర నిధులను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, శుక్రవారం నుంచి కాలనీవాసులు ఎటువైపు తిరిగితే అటువైపు బస్‌లను నడుపుతామని హామీ ఇచ్చారు.
టింబర్‌లేక్ కాలనీ మీదుగా రోడ్డును అడ్డుకుంటున్నారని పేర్కొనటంతో వారితో చర్చించి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలాగే కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్‌లు అందిస్తామని, కళాకారుల పింఛన్‌లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. తామంతా 15వేల మంది ఉండగా అందులో కేవలం 4 వేలమందికే గృహాలు ఇచ్చారని మిగతా వారికి పక్కనే ఉన్న మరో 9 ఎకరాల భూమిని కేటాయించాలని కోరటంతో ముఖ్యమంత్రితో చర్చించి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
కాలనీకి ఉచిత వైఫై సేవలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, జలమండలి డెరైక్టర్ కొండారెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జీలు స్వర్ణలతారెడ్డి, శంకర్‌గౌడ్, మణికొండ సర్పంచ్ కె.నరేందర్‌రెడ్డి, ఆర్డీవో సురేశ్ పోద్దార్ తదితరులు పాల్గొన్నారు.